Delhi Exit Polls : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఇటీవలే కొన్ని సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అవి పూర్తిగా ఆప్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్‌ను ఇచ్చాయి. ఆ విధంగా అంచనాలను వెలువరించిన మూడు సంస్థల లెక్కలను మనం ఓసారి పరిశీలిద్దాం. ‘వీ ప్రెసైడ్’ సంస్థ ఆప్‌కు 45 నుంచి 52 సీట్లు రావొచ్చని తెలిపింది. బీజేపీ 18 నుంచి 23 సీట్లకే పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ‘మైండ్ బ్రింక్’ సంస్థ ఆప్‌కు 44 నుంచి 49 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీ 21 నుంచి 25 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇక జీనియా ఏఐ ఎగ్జిట్ పోల్‌లో ఆప్‌కు 33 నుంచి 38 సీట్లు, బీజేపీకి 31 నుంచి 36 సీట్లు వస్తాయని గుర్తించారు.
అసలు ఫలితాలతో పొంతన లేని రీతిలో..
ఇప్పుడు వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు.. ఈ ఎగ్జిట్ పోల్స్‌కు ఏ మాత్రం సంబంధం లేనట్టుగా కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12.52 గంటల సమయానికి బీజేపీ 48 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 చోట్ల లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 1 చోట లీడ్‌లో ఉంది. ఢిల్లీలోని క్షేత్ర స్థాయి పరిస్థితులు, ప్రజల అభిప్రాయంతో పొంతన లేని రీతిలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం తగినంత సంఖ్యలో ప్రజాభిప్రాయపు శాంపిల్స్‌ను సేకరించకుండా ఈ సంస్థలు ఎగ్జిట్ పోల్స్(Delhi Exit Polls) ఫలితాలను ఇచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు.
Also Read :Delhi New CM : కౌన్ బనేగా ఢిల్లీ సీఎం ? సీఎం రేసులో ఉన్న బీజేపీ నేతలు వీరే
గత ఎగ్జిట్ పోల్స్ లెక్కలు..
- 2020 సంవత్సరంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఆనాడు ఆప్ విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు సరిగ్గానే అంచనా వేశాయి. అప్పట్లో ఆప్ 62 అసెంబ్లీ సీట్లను గెల్చుకొని సూపర్ విజయం సొంతం చేసుకుంది.
- 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లెక్క మరోసారి తప్పింది. అనూహ్యంగా ఆప్ కంటే బీజేపీ ఎక్కువ లోక్‌సభ సీట్లను దక్కించుకుంది.
- ఆయా లోక్‌సభ స్థానాల్లో ఎగ్జిట్ పోల్స్ కోసం శాంపిళ్ల సేకరణలో జరిగిన తప్పిదాల వల్లే ఆనాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు అయ్యాయి.
- ఎగ్జిట్ పోల్స్ కోసం శాంపిల్స్‌ను విభిన్న ప్రాంతాలు, విభిన్న వర్గాల నుంచి సేకరించాలి. కనీస సంఖ్యలో శాంపిల్స్ లేకుండా ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చే ఫలితం తప్పుగానే ఉంటుంది.