రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలితో (Cold Wave) ప్రజలు వణికిపోతున్నారు. ఒక్కసారి వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావడంతో పలు ప్రాంతాల్లో మంచుగా మారుతున్నాయి. దీంతో దేశం వ్యాప్తంగా కోల్డ్‌వేవ్ ప్రభావం కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాలో రెడ్ అలర్ట్, రాజస్థాన్, బీహార్‌లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ (Delhi)లో కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అనేక విమానాలను రద్దుచేశారు. మరిన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాయు నాణ్యత సూచి వెరీపూర్ కేటగిరికి పడిపోయింది. చలి, పొగమంచు దెబ్బకు ఆప్(AAP) ప్రభుత్వం ఏకంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 15 వరకూ సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక చలి దెబ్బకు తెలుగు రాష్ట్రాలు గజగజలాడిపోతున్నాయి. దేశంలో మరో 3 రోజులు ఇదే తీవ్రతతో పరిస్థితి కొనసాగవచ్చని, చిన్నపిల్లలు.. వృద్ధులు.. శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
తెలంగాణలో ఆరేంజ్ అలర్ట్
జనవరి 11 వరకు రాష్ట్రంలో (Telangana) చలి కొనసాగుతుందని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది. ముఖ్యంగా జనవరి 8, 9 తేదీల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఉత్తరాంధ్రలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Cold Wave) జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. అంటే సింగిల్ డిజిట్‌కు పడిపోవచ్చని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి సహా మరో 20 జిల్లాలకుఅలర్ట్ జారీచేసింది. ఈ ప్రాంతాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండవచ్చని తెలిపింది. తెలంగాణలో మూడు క్రితం వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.
ఏపీలోనూ చలి పంజా
ఏపీలోనూ (AP) చలి పంజా విసురుతోంది. మొదటిసారిగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు (Cold Wave) గణనీయంగా పడిపోవడంతో స్థానికులు చలికి గజగజ వణుకుతున్నారు. ఏజెన్సీలోని మినుములూరులో దాదాపు 9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్నోగ్రత నమోదవ్వగా, పాడేరు, లంబసింగిలో సుమారు 8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, అరకు, చింతపల్లిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తీవ్ర చలి కారణంగా బయట పార్క్ చేసిన కార్లు సైతం గడ్డగట్టిపోతున్నాయి.