Site icon HashtagU Telugu

Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట..18 మంది మృతి

Delhi Railway Station Stamp

Delhi Railway Station Stamp

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kubhamela )కు దేశ నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి తీవ్రమైన తొక్కిసలాట (Delhi Stampede) జరిగింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో రైలు ఎక్కే క్రమంలో తోపులాట ప్రారంభమైంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించారని (18 dies) అధికారులు ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో వారిని చికిత్స నిమిత్తం ఢిల్లీ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇప్పటి వరకు 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు చనిపోయారని అధికారులు వెల్లడించారు.

స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫాంల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మహా కుంభమేళా చివరి దశకు చేరుకోవడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు. కానీ అనూహ్యంగా భారీగా భక్తులు రావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ 14వ నంబరు ప్లాట్‌ఫాంపై నిలిచి ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా రాగా, వాటి కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది. ప్లాట్‌ఫాం మారేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా దూసుకురావడం, నియంత్రణ లేకపోవడం వల్ల ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే శాఖ ఇంకా అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటించనప్పటికీ, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కూడా ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా ముగియనుండటంతో భక్తులు గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు ఎగబడుతున్నారు. 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహా కుంభమేళా కావడంతో, భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, భక్తులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.