Wrestlers Issue: రెజ్లర్ల పట్టుకు దిగొచ్చిన ఢిల్లీ పోలీసులు.. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నట్టు ప్రకటన

ఢిల్లీలో రెజ్లర్ల నిరసనకు తొలి ఫలితం దక్కింది.. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపి బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 10:13 PM IST

Wrestlers Issue: ఢిల్లీలో రెజ్లర్ల నిరసనకు తొలి ఫలితం దక్కింది.. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపి బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే కేసు నమోదై బ్రిజ్‌భూషణ్‌ అరెస్ట్ చేసే వరకూ తమ పోరాటం ఆగదంటున్నారు రెజ్లర్లు. మరోవైపు దేశవ్యాప్తంగా కుస్తీవీరులకు క్రీడా,రాజకీయ ప్రముఖులు మద్ధతుగా నిలుస్తున్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌స బీజేపీ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణల వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేయనున్నట్టు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

నిజానికి బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల చేస్తూ తొలిసారి రోడ్డెక్కినప్పుడు తెలిపినప్పుడు ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వారు నిరసనను విరమించారు. ప్రభుత్వ హామీలేవీ నెరవేరకపోవడంతో రెజ్లర్లంతా మళ్లీ నిరసన బాట పట్టారు. ఢిల్లీ పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటీషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రాథమిక దర్యాప్తు చేయకుండా, కేవలం ఆరోపణల ఆధారంగా నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని రెండురోజుల క్రితం సుప్రీంకు చెప్పిన ఢిల్లీ పోలీసులు తాజాగా కేసు నమోదు చేయనున్నట్టు ప్రకటించారు.
ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని, బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేయాల్సిందేనని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలు తెలుపుతూనే తమ ప్రాక్టీస్‌ను కూడా కొనసాగిస్తున్నారు రెజ్లర్లు.

అయితే బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలకు సంబంధించి కీలక ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామన్నారు రెజ్లర్లు. మరోవైపు దేశవ్యాప్తంగా రెజ్లర్ల నిరసనకు మద్ధతు పెరుగుతోంది. క్రీడా,రాజకీయ ప్రముఖులందరూ రెజ్లర్లకు మద్ధతు తెలిపారు. క్రికెటర్లు, ఇతర అథ్లెట్లు వారికి న్యాయం చేయాలని కోరారు. అయితే ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉష రెజ్లర్ల నిరసనపై విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. ఇలా వీధుల్లోకి ఎక్కి నిరసన తెలపడం సరికాదని, కొంత క్రమశిక్షణ పాటించి ఉంటే బావుండేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై రెజ్లర్లు, ఇతర ప్రముఖులు మండిపడుతున్నారు.