Site icon HashtagU Telugu

Shocking : ఢిల్లీ పోలీసుల సంచలనం.. రూ. 2 కోట్లతో పరారైన ఎస్సై జంట అరెస్ట్

Delhi Police

Delhi Police

Shocking : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నేరానికి పాల్పడితే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఢిల్లీ సైబర్ పోలీసు విభాగంలో ఇలాంటి సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. సబ్-ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న అంకుర్ మాలిక్, నేహా పునియా అనే జంట సైబర్ నేరగాళ్ల నుంచి రికవర్ చేసిన రూ. 2 కోట్ల సొమ్ముతో పరారయ్యారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.

 అంకుర్ మాలిక్ ఢిల్లీ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ పలు కేసులను విజయవంతంగా పరిష్కరించాడు. కానీ బాధితుల నుండి రికవర్ చేసిన సొమ్మును వారికి తిరిగి ఇవ్వకుండా, నకిలీ ఫిర్యాదుదారుల పేరిట కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచి, ఆ ఖాతాలకు మొత్తం రూ. 2 కోట్లు బదిలీ చేశాడు. ఈ ప్లాన్‌ను అమలు చేసే క్రమంలో అతను ఏడు రోజుల సెలవు తీసుకుని అదృశ్యమయ్యాడు. అదే సమయంలో అతని బ్యాచ్‌మేట్, మహిళా ఎస్సై నేహా పునియా కూడా కనిపించకుండా పోవడం అనుమానాలను రేకెత్తించింది.

Wife Murder Husband : కట్టుకున్న పాపానికి మొగుళ్లను ఇంత దారుణంగా హత్యలు చేస్తారా..?

 ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. 2021లో శిక్షణ సమయంలోనే అంకుర్, నేహా మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందని విచారణలో తేలింది. అప్పటి నుంచే వీరిద్దరూ రికవరీ సొమ్ముతో పరారయ్యే యోచన చేశారని సమాచారం. డబ్బు దొరకగానే ఈ జంట తమ తమ కుటుంబాలను విడిచిపెట్టి గోవా, మనాలి, కశ్మీర్ వంటి పర్యాటక ప్రదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపారని పోలీసులు గుర్తించారు.

 ఢిల్లీ పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా పద్ధతులను వినియోగించి చివరకు ఇండోర్‌లో వీరి ఆచూకీ కనుగొన్నారు. అక్కడ వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి రూ. కోటి విలువైన బంగారం, రూ. 12 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు బదిలీకి సహకరించిన మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.

 “ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. నిందితులను త్వరలో కోర్టులో హాజరుపరుస్తాము” అని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే ఇలాంటి నేరాలకు పాల్పడటం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనతో పోలీసు వ్యవస్థపై కఠినమైన అంతర్గత పరిశీలన అవసరమని పలువురు సూచిస్తున్నారు.

Wife Murder Husband : కట్టుకున్న పాపానికి మొగుళ్లను ఇంత దారుణంగా హత్యలు చేస్తారా..?