Site icon HashtagU Telugu

AAP Vs BJP: ఢిల్లీ మేయర్ ఎన్నిక రసాభాస.. తన్నుకున్న బీజేపీ, ఆమ్ నేతలు!

Delhi Mayor

Delhi Mayor

ఢిల్లీ మేయర్ (Delhi mayor) ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. ఎంసీడీ కార్యాలయంలో రాసాభాస జరిగింది. మేయర్ (Delhi mayor) ఎన్నిక కారణంగా బీజేపీ, ఆప్ నేతలు తిట్టుకున్నారు. తీవ్ర వాగ్వాదానికి దిగడంతో నాయకుల చొక్కాలు చినిగాయి. తోసుకొని తన్నుకున్నారు. బాహాబాహికి దిగారు. బీజేపీ (BJP) కౌన్సిలర్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజ్రీవాల్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

తాము ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ.. మేయర్ పీఠం దక్కించకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కౌన్సిలర్లు మండిపడుతున్నారు. బీజేపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం.. మీది మీదకు వెళ్లడంతో.. సభలో రచ్చ రచ్చ జరిగింది. మేయర్ (Delhi mayor) ఎన్నికలు నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడైన ముకేశ్ గోయెల్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. సీనియర్ సభ్యుడినే ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఐతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మాత్రం ముకేశ్ గోయెల్‌ని కాకుండా.. సత్య శర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన సభలోకి చేరుకొని.. కౌన్సిలర్‌ల ప్రమాణస్వీకారాన్ని ప్రారంభించారు. ఇంతలోనే ఆమ్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి.. ఆందోళన చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే సత్యశర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.

‘‘గొడవలను ఆప్ (AAp) నేతలే ప్రారంభించారు. నిబంధనలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. వారు మెజారిటీలో ఉన్నప్పుడు, వారు ఎందుకు భయపడతారు? రాజ్యసభలో కూడా ఆప్ ఎంపీలు అదే చేస్తున్నారు. వారు ఓటింగ్‌కు అనుమతించాలి’ అని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి అన్నారు. ‘బీజేపీ గూండాయిజం చేస్తోంది. ముందుగా నామినేటెడ్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. మేము దానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాన్ని ముందుగా నిర్వహించాలని కోరడంతో గొడవ జరిగింది ”అని ఆప్ కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

Also Read: AP Politics: జగన్ కు షాక్.. టీడీపీలోకి మాజీ హోంమంత్రి!