ఎటు చూసినా పొగ.. కాసేపటి తరువాత అది వెళ్లిపోతుందిలే అనుకుంటే.. ముక్కు మూసుకోవచ్చు. కానీ ఆ పొగ ఎప్పటికీ అలాగే ఉంటుంది.. ఊపిరి కూడా తీస్తుంది అంటే మాత్రం భయపడతారు. అలాంటి కాలుష్యం ఢిల్లీని కమ్మేసింది. అది కూడా అలా ఇలా కాదు.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారకమైన రాజధానిగా నాలుగో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. అయినా ఇది సంతోషపడాల్సిన విషయం కాదు.. డేంజర్ బెల్స్ మోగుతున్నాయని గుర్తించాల్సిన అలారం.
ప్రపంచంలో 117 దేశాల్లో 6,475 నగరాల్లో, పట్టణాల్లోని గాలిలో స్వచ్ఛత ఎంత అన్నదానిపై పరీశీలన జరిపింది స్విస్ పొల్యూషన్ టెక్నాలజీ కంపెనీ అయిన ఐక్యూ ఎయిర్. ఇందులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలీ కాలుష్యం మన దగ్గరేనా ఇంకా ఎక్కడైనా ఈ స్థాయిలో ఉందా అని చూస్తే.. మరికొన్ని చోట్ల ఉంది. మధ్య, దక్షిణాసియా ప్రాంతాల్లోని నగరాల్లోనే పొల్యూషన్ ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రపంచంలో ఎక్కువ కాలుష్యంతో నిండిపోయిన టాప్-50 నగరాల జాబితాను చూస్తే.. అందులో 46 నగరాలు మధ్య, దక్షిణాసియాల్లోనే ఉన్నాయి. పైగా వీటిలో 11 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. నిజంగా ఇది మనకు సిగ్గుచేటే. ప్రజల ప్రాణాలను తోడేస్తున్న కాలుష్యానికి మన నగరాలు ఆవాసాలుగా మారుతున్నాయి. అతి భయంకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలో ఎక్కువ కాలుష్యకారక నగరాలు మన దేశంలోనే ఉండడం.
గాలిలో నాణ్యత అత్యంత ఘోరంగా ఉండే నగరాల్లో టాప్-100ను చూస్తే.. అందులో 63 నగరాలు లేదా పట్టణాలు మన దేశంలోనే ఉండడం నిజంగా దురదృష్టకరం. పైగా ఈ 63 నగరాల్లో సగానికన్నా ఎక్కువశాతం.. హర్యాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వీటిలో తొలి మూడు స్థానాల్లో రాజస్థాన్ లోని భివాడీ, ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్, ఢిల్లీ ఉన్నాయి.
మన తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే.. ఐదు నగరాలు కాలుష్యానికి నివాసంగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం 155వ స్థానంలో ఉంటే.. తెలంగాణలోని హైదరాబాద్ 232వ స్థానంలో ఉంది.