Delhi Hit and Run: హిట్ అండ్ రన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

దేశ రాజధానిలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసింది యువతిని కారు ఈడ్చుకుపోయిన ఘటన.

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 10:41 PM IST

Delhi Hit and Run: దేశ రాజధానిలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసింది యువతిని కారు ఈడ్చుకుపోయిన ఘటన. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో .. ఐపీఎస్ షాలినీ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక టీమ్‌ విచారణను పర్యవేక్షిస్తోంది.

మృతురాలు అంజలీ సింగ్‌పై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కారు ఈడ్చుకుపోవడంతో షాక్‌, తీవ్రగాయాలతో బాధితురాలు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యుల బృందం నిర్థారించింది. యువతిని కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో బాధితురాలితో ఉన్న యువతి సంచలన ఆరోపణలు చేసింది. అంజలి కారు కింద ఇరుక్కుపోయిన విషయం లోపలున్న కుర్రాళ్లకు తెలుసని చెప్పింది.

తనపైనా కారు ఎక్కించేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. అంజలిని కాపాడేందుకు ప్రయత్నించానని.. కానీ తన వల్లే కాలేదని తెలిపింది. భయపడే పోలీసులకు రిపోర్ట్ చేయలేదని చెప్పుకొచ్చింది. అయితే ఘటనకు ముందు హోటల్ రూమ్‌లో ఇద్దరు యువతుల మధ్య గొడవ జరిగినట్టు అక్కడి స్టాఫ్ చెబుతున్నారు. దీనిపైనా దృష్టిపెట్టారు పోలీసులు.
కొత్త సంవత్సరం రోజు ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన కారు.. దాదాపు 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కారు టైరులో యువతి కాలు ఇరుక్కుపోవడం వల్ల ఆమెను లాక్కెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. కారులో ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేశారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు విచారణలో అంగీకరించారు నిందితులు. బాధిత కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల పరిహారం ప్రకటించారు. కోర్టులో పోరాడడానికి లాయర్‌ను కూడా నియమిస్తున్నట్లు తెలిపారు.