Jama Masjid : దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు ప్రఖ్యాత చారిత్రక కట్టడం. దాన్ని రక్షిత స్మారక కట్టడంగా గుర్తించరాదని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జామా మసీదు నిర్వహణ బాధ్యతలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు అప్పగించరాదని అప్పట్లో యూపీఏ సర్కారు తేల్చి చెప్పింది. ఈమేరకు నిర్ణయంతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సంతకం చేసిన ఫైలుపై దుమారం రేగుతోంది. దాన్ని తమకు సమర్పించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆగస్టు 28న ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ పిటిషన్‌పై తిరిగి విచారణ జరగగా.. ఏఎస్ఐ అధికారులు ఆ ఫైల్‌ను హైకోర్టుకు సమర్పించలేదు. దీనిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read :BookMyShow : రూ.2500 టికెట్ రూ.3 లక్షలకు సేల్.. ‘బుక్ మై షో’ సీఈఓ, టెక్ హెడ్‌లకు సమన్లు
ఆ కీలకమైన ఫైలును తమకు సమర్పించేందుకు చివరి అవకాశం ఇస్తామని న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం (Jama Masjid) తెలిపింది. అక్టోబరులో తదుపరి విచారణ జరిగేలోగా ఆ ఫైలుతో పాటు అఫిడవిట్‌ను సమర్పించాలని ఏఎస్ఐను ఆదేశించింది. ఈ అంశంపై నేరుగా ఫోకస్ పెట్టాలని ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్‌కు కోర్టు నిర్దేశించింది. దీనిపై సమగ్రమైన అఫిడవిట్‌ను రూపొందించేందుకుగానూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులతో సమావేశం కావాలని ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్‌కు సూచించింది. జామా మసీదును రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించాలని, దాని చుట్టుపక్కల ఉన్న అన్ని ఆక్రమణలను తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజాలను (పిల్) ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది. ఈక్రమంలోనే జామా మసీదు స్టేటస్‌కు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో తీసుకున్న నిర్ణయంతో కూడిన ప్రతులను పరిశీలించాలని కోర్టు భావిస్తోంది. దీంతోపాటు జామా మసీదు ఇమామ్ మౌలానా సయ్యద్ అహ్మద్ బుఖారీ ‘షాహీ ఇమామ్’ అనే బిరుదును వినియోగడంపై, ఆయన కుమారుడిని నాయబ్ (డిప్యూటీ) ఇమామ్‌గా గుర్తించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2014లో ఓ పిల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది. దాన్ని కూడా న్యాయస్థానం విచారిస్తోంది.