Parvesh Verma : న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన ఎవరు ? పర్వేశ్ నేపథ్యం ఏమిటి ? ఆయన ఆస్తులెన్ని ? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Delhi Exit Polls : ‘ఎగ్జిట్ పోల్స్’ లెక్క తప్పింది.. ఢిల్లీలో కూలిన కేజ్రీ‘వాల్’
పర్వేశ్ వర్మ ఎవరు?
పర్వేశ్ వర్మ(Parvesh Verma).. 1977లో జన్మించారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ గతంలో ఢిల్లీ బీజేపీలో సీనియర్ నేత. ఢిల్లీ ముఖ్యమంత్రిగా సైతం సాహిబ్ సింగ్ వర్మ సేవలు అందించారు. పర్వేశ్ వర్మ ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కిరోరి మాల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేశారు. జాట్ వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడిగా పర్వేశ్ ఎదిగారు. ఆయన గతంలో రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పర్వేశ్ వర్మ అంకుల్ ఆజాద్ సింగ్ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా సేవలు అందించారు. 2013 ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై ముండ్కా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
పర్వేశ్ వర్మ ఆస్తిపాస్తులు
- పర్వేశ్ వర్మ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆస్తిపాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఆయన వ్యక్తిగత నికర ఆస్తుల విలువ దాదాపు రూ.89 కోట్లు.
- ఆయన భార్య స్వాతి సింగ్ నికర ఆస్తుల విలువ రూ. 24.4 కోట్లు.
- పర్వేశ్, ఆయన సతీమణి మొత్తం నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 113 కోట్లు.
- పర్వేశ్ వర్మకు ఈక్విటీ, స్టాక్ మార్కెట్లలో దాదాపు రూ. 52.75 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అంతమేర విలువ చేసే షేర్లు, బాండ్లను ఆయన కొన్నారు.
- పర్వేశ్‌కు రూ. 17 లక్షలు విలువైన బీమా పెట్టుబడులు కూడా ఉన్నాయి.
- ఆయన భార్యకు రూ. 5.5 లక్షల విలువైన బీమా పాలసీలు ఉన్నాయి.
పర్వేశ్ వర్మ కార్లు
పర్వేశ్ వర్మకు టయోటా ఫార్చ్యూనర్, టయోటా ఇన్నోవా, మహీంద్రా XUV కార్లు ఉన్నాయి. ఆయన వద్ద రూ. 8.25 లక్షలు విలువైన 200 గ్రాముల బంగారం కూడా ఉంది.