BJPs Capital Gain : ‘క్యాపిటల్ గెయిన్’ అంటే ‘మూలధన లాభం’ అని అర్థం. బీజేపీకి ఇప్పుడు ‘క్యాపిటల్ గెయిన్’ వచ్చింది. ఈసందర్భంలో ‘క్యాపిటల్’ అంటే ‘దేశ రాజధాని’ అని అర్థం. ‘దేశ రాజధానిలో బీజేపీ పాగా’ అనే అర్థంలో మనం ‘క్యాపిటల్ గెయిన్’ను చూడాల్సి ఉంటుంది. ఇదంతా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. దీనికి సరిగ్గా నాలుగు రోజుల ముందు (ఫిబ్రవరి 1న) పార్లమెంటులో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ. 12 లక్షల దాకా వార్షిక ఆదాయంపై సున్నా ట్యాక్స్ అని ఆమె సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రభావంతో ఢిల్లీలోని యావత్ మిడిల్ క్లాస్ ఓటర్లు రాత్రికిరాత్రి బీజేపీ వైపునకు తిరిగిపోయారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Also Read :Parvesh Verma : కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ ఎంత ఆస్తిపరుడో తెలుసా ?
ఉద్యోగ వర్గమే లక్ష్యంగా..
ఆదాయపు పన్ను గురించి నిత్యం ఆలోచించేది ఉద్యోగ వర్గమే. ఢిల్లీ అనేది మెట్రో నగరం. ఇక్కడ ఉండేవారిలో సింహభాగం మంది ఉద్యోగులే. వారందరూ ఏటా ఆదాయపు పన్నును చెల్లిస్తుంటారు. ఇలాంటి వారందరినీ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రసంగంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచింపజేశారు. బీజేపీ(BJPs Capital Gain) అయితేనే బెటర్ అని నిర్ణయించుకునేలా చేశారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆమె చేసిన ఆ ఒక్క ప్రకటన కలిగించిన ప్రభావంతో ఢిల్లీలోని మిడిల్ క్లాస్ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారని అంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాల సమయానికి ఢిల్లీలోని 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 24 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు చాలు. అంటే ఢిల్లీలో బీజేపీ సర్కారును ఏర్పాటు చేయడం ఖాయం.
Also Read :Delhi Exit Polls : ‘ఎగ్జిట్ పోల్స్’ లెక్క తప్పింది.. ఢిల్లీలో కూలిన కేజ్రీ‘వాల్’
బంపర్ మెజారిటీకి బాటలు
ఇంతటి బంపర్ మెజారిటీ బీజేపీకి దక్కడానికి కేవలం రాజకీయపరమైన అంశాలే కారణమని భావిస్తే తప్పులో కాలేసినట్టేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రూ. 12 లక్షల దాకా వార్షిక ఆదాయంపై సున్నా ట్యాక్స్ అనే ప్రకటన కూడా కీలక భూమిక పోషించిందని అభిప్రాయపడుతున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి ఎన్నికల్లో ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ఎన్నో సంక్షేమ పథకాలను ఆయన ప్రకటించారు. అయితే ‘‘రూ.12 లక్షల దాకా వార్షిక ఆదాయంపై నో ట్యాక్స్’’ అనే ఒకే ఒక్క వాక్యంతో బీజేపీకి భారీ మైలేజీని నిర్మల సాధించిపెట్టారని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.