Yamuna River Levels: యమునా నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి సాయంత్రం 7.24 గంటల వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు యమునా నది నీటిమట్టం (Yamuna River Levels) 207.09 మీటర్లుగా నమోదైంది. మరోవైపు కేంద్ర జల సంఘం (CWC) రాత్రి 8 గంటల వరకు నీటిమట్టం 207.40 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను అప్రమత్తం చేశారు.
యమునా నదిలో 1963 తర్వాత ఐదోసారి 207 మీటర్ల మార్కు
నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ నివేదికల ప్రకారం.. 1963 తర్వాత యమునా నదిలో నీటిమట్టం 207 మీటర్ల మార్కును దాటడం ఇది ఐదోసారి. గతంలో 1978లో 207.49 మీటర్లు, 2013లో 207.32 మీటర్లు, 2023లో రికార్డు స్థాయిలో 208.66 మీటర్లకు నీటిమట్టం పెరిగి ఢిల్లీలో వరదలు వచ్చాయి. ఈసారి సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 1 గంటకు 207 మీటర్లు, 2 గంటలకు 207.04 మీటర్లు, 3 గంటలకు 207.09 మీటర్లకు చేరుకుంది. రాత్రి 8 గంటల నాటికి 207.40 మీటర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. వరదల ముప్పు ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించి, నగరంలో ఏర్పాటు చేసిన 28 తాత్కాలిక శిబిరాల్లో 10,000 మందికి పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించింది.
Also Read: Hema Malini: బాలీవుడ్ నటి గ్యారేజీలో కొత్త లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
ఢిల్లీలో వరదల పరిస్థితిపై ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ మోహ్సేన్ షాహెదీ మాట్లాడుతూ.. హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల హతిని కుండ్ బ్యారేజ్ నుంచి నీరు విడుదల అయిందని, ఢిల్లీలో కూడా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నదిలో నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించాయి. ఐదు బృందాలను మోహరించామని, ప్రజలను తరలించే పని పూర్తయిందని, పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని ఆయన చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఐఎండి జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిషా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, పంజాబ్, ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు.
నిగంబోధ్ శ్మశాన వాటికలోకి చేరిన వరద నీరు
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్‌లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. అయితే ఇప్పటికీ అక్కడ అంత్యక్రియలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి దానిని మూసివేయలేదని ఎంసీడీ అధికారులు తెలిపారు. నీటిమట్టం మరింత పెరిగితే కొంతకాలం పాటు శ్మశాన వాటికను మూసివేసే అవకాశం ఉందని చెప్పారు.