Site icon HashtagU Telugu

Delhi Congress Chief : అకస్మాత్తుగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా.. కారణం ఏమిటి ?

Delhi Congress Chief

Delhi Congress Chief

Delhi Congress Chief :  సార్వత్రిక ఎన్నికల వేళ మరో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది.  కాంగ్రెస్ పార్టీ  ఢిల్లీ చీఫ్ అర్విందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ పెద్దలకు అందజేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తూ అర్విందర్ సింగ్ రాజీనామా చేశారు. ఈవిషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలోనూ ప్రస్తావించారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ విభాగం వ్యతిరేకించినప్పటికీ .. అధిష్టానం అదేం పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అర్విందర్ ఆరోపించారు. ఢిల్లీ కాంగ్రెస్ క్యాడర్ మనోభావాలకు విరుద్ధంగా ఆప్‌తో కలిసి నడవలేక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీలో లోక్‌సభ టికెట్ల పంపిణీ విషయంలోనూ తన అభిప్రాయానికి సముచిత విలువ దక్కలేదని  అర్వింద్(Delhi Congress Chief) పేర్కొన్నారు. తాను సూచించిన అభ్యర్థులకు కూడా టికెట్లు రాలేదని ఆయన తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవిలో ఉన్నా.. తన మాటకు విలువ లేకపోవడంతో  అర్విందర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ అసంతృప్తి సెగే ఇప్పుడు రాజీనామా రూపంలో బయటికి వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక ఢిల్లీలో లోక్‌సభ సీట్ల పంపిణీ అంశంపై ఏఐసీసీ ఢిల్లీ ఇన్‌‌ఛార్జి దీపక్ బాబ్రియాతో ఇటీవల అర్విందర్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో  అర్విందర్‌పై చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ  సమావేశమైంది. అయితే అర్విందర్‌పై  చర్యలు తీసుకునే నిర్ణయాన్ని ఏఐసీసీకే వదిలేయాలని నిర్ణయించారు. ఈపరిణామాల నేపథ్యంలో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి అర్వింద్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

Also Read : Asaduddin Owaisi : ఓటర్లకు చేరువయ్యేందుకు తెలుగు పాటలను విడుదల చేసిన ఓవైసీ

అర్విందర్ కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన 15ఏళ్ల పాటు షీలా దీక్షిత్ ప్రభుత్వంలో విద్య, పర్యాటక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు.  2017లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. అయితే ఏడాదిలోపే మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారు. గత సంవత్సరమే (2023 ఆగస్టులో)  ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అరవిందర్ సింగ్ లవ్లీని పార్టీ నియమించింది. కాగా, ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. పొత్తులో భాగంగా ఢిల్లీలోని ఏడు లోక్ సభ సీట్లలో ఆప్‌ నాలుగు చోట్ల, కాంగ్రెస్‌కు మూడు చోట్ల పోటీ చేస్తున్నాయి.

Also Read :Tollywood : ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్ స్టాండ్ ఏమిటి ?