Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్గాలు కీలక వివరాలను వెల్లడించాయి. ఇప్పుడు కేజ్రీవాల్ అస్వస్థతతో ఉన్నారని, మార్చి 21న అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని తెలిపాయి. ఈవివరాలన్నీ తీహార్ జైలు అధికారులు బయటపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్ గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతోందన్నారు. ఒకానొక దశలో బ్లడ్ షుగర్ లెవల్ 50 కంటే తక్కువకు పడిపోయిందని ఆప్ వర్గాలు చెప్పాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బ్లడ్ షుగర్ లెవల్‌ను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు కేజ్రీవాల్ డాక్టర్లు సూచించిన మందులు వాడుతున్నారని ఆప్ వర్గాలు చెప్పాయి. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే ఆయనకు మధ్యాహ్నం, రాత్రి ఇంటి భోజనం అందించాల్సి వస్తోందన్నారు. ఈనేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా అత్యవసర వైద్యం అవసరమైతే సాయం చేసేందుకు .. తీహార్ జైలులోని ఆయన సెల్ దగ్గర క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను ఉంచామని జైలు అధికారులు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) గతంలో కోర్టు విధించిన ఈడీ కస్టడీ గడువు ఏప్రిల్ 1న ముగిసింది. దీంతో ఆయనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఏప్రిల్ 15 వరకు తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈనేపథ్యంలో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. తనకు బెయిల్ ఇప్పించాలని అరవింద్ కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. దీనిపై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాలి. అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం కూడా క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు రూపంలో ఊరట దక్కే అవకాశం ఉంటుందని ఆప్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read :Poisoned In Jail : ఆహారంలో టాయిలెట్ క్లీనర్.. ఇమ్రాన్ ఖాన్ భార్యపై విష ప్రయోగం ?
ఈడీ వాదన ఇలా..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదిస్తోంది. ఇటీవల తమ కస్టడీలో ఉండగా ఆయన్ను విచారించినప్పుడు అసలు విషయాలేం చెప్పలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ అంటోంది. కనీసం ఢిల్లీ సీఎం క్యాంపు ఆఫీసులో ఎవరెవరు పనిచేశారనేది కూడా తెలియదని కేజ్రీవాల్ బదులిచ్చారని ఈడీ ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు చెప్పింది. ఇవాళ ఇవే విషయాలను ఢిల్లీ హైకోర్టు ఎదుట కూడా ఈడీ తరఫు న్యాయవాది ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. గతంలో ఆప్ మీడియా ఇన్ ఛార్జిగా వ్యవహరించిన విజయ్ నాయర్ సైతం ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్నాడు. అతడెవరో తనకు అంతగా తెలియదని.. ఢిల్లీ ప్రభుత్వంలోని మరో ఇద్దరు మంత్రులకు విజయ్ రిపోర్ట్ చేశాడని విచారణలో కేజ్రీవాల్ చెప్పారని ఇటీవల ఈడీ వెల్లడించింది.