Govt Employees Assets : ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తమతమ స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. లేదంటే వచ్చే నెల ఒకటిన శాలరీలు అందవని స్పష్టం చేసింది. ఈమేరకు యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. యూపీ ప్రభుత్వంలోని అందరు అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, విభాగాధిపతులు తమ ఆస్తుల వివరాలను(Govt Employees Assets) రాష్ట్ర సర్కారుకు చెందిన ‘మానవ్ సంపద పోర్టల్’లో సెప్టెంబర్ 30 లోగా నమోదు చేయాలని నిర్దేశించారు.
Also Read :Sensex 85000 : 85వేలు దాటిన సెన్సెక్స్.. లైఫ్ టైం గరిష్ఠానికి చేరిక
ఈ ఆదేశాల అమలుపై సమీక్షించే బాధ్యతను యూపీ ప్రభుత్వం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డిడిఓ)కు అప్పగించింది. పోర్టల్‌లో తమ ఆస్తుల వివరాలను అందించిన ఉద్యోగులకు మాత్రమే వారి సెప్టెంబర్ జీతాలు అందుతాయని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 శాతం మంది ఇప్పటికే తమ ఆస్తుల వివరాలను అందించారని గుర్తు చేసింది. యూపీలోని మొత్తం 8.44 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 7.19 లక్షల మంది తమ ఆస్తుల సమాచారాన్ని ఇప్పటికే మానవ్ సంపద పోర్టల్‌లో నమోదు చేశారని తెలిపింది. గతంలోనూ యూపీ సర్కారు ఇదే తరహా ఆదేశాలను ఒకసారి ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 31లోగా ఆస్తుల వివరాలను సమర్పించాలని ప్రభుత్వ ఉద్యోగులను అప్పట్లో ఆదేశించింది. అయితే కొంతమంది ఉద్యోగులు మరింత గడువు కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు వారికి ఛాన్స్ ఇచ్చింది. ఈ గడువు ముగియ వస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఉద్యోగుల ఆస్తుల వివరాలను సేకరించడం ద్వారా వారి పనితీరులో మరింత మెరుగుదలను సాధించాలని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం యూపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.