Controversy Deaths : మ‌ర‌ణాల‌పై కుట్ర కోణం

రాజ‌కీయాల‌కు ఏదీ అతీతంగా కాదని నానుడిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ప్ర‌స్తుతం ఉండే లీడ‌ర్లు చూపిస్తున్నారు.

  • Written By:
  • Updated On - February 23, 2022 / 03:43 PM IST

రాజ‌కీయాల‌కు ఏదీ అతీతంగా కాదని నానుడిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు ప్ర‌స్తుతం ఉండే లీడ‌ర్లు చూపిస్తున్నారు. స‌హ‌జ మ‌ర‌ణాల‌ను, ప్ర‌మాదాల‌ను కూడా రాజ‌కీయ కోణం నుంచి చూడ‌డం మామూలు అయింది. ఇక హ‌త్య‌ల‌పై జ‌రిగిన రాజకీయ దుమారం ఇప్ప‌టికే ఏదో ఒక సంద‌ర్భంలో వెంటాడుతూనే ఉంది. రెండు ద‌శాబ్దాలుగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు, వాటిని వెంటాడుతోన్న రాజ‌కీయాల‌ను అవ‌లోక‌నం చేసుకుంటే, రాజ‌కీయ నేత‌ల వాల‌కం అర్థం అవుతోంది.
స్వ‌ర్గీయ ఎన్టీఆర్ మ‌రణంపై అనుమానాలు అనేకం. ఆ రోజున ఆయ‌న్ను మానసిక క్షోభ‌కు గురిచేసి చ‌నిపోయేలా చంద్ర‌బాబు చేశాడ‌ని ఇప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తుంటారు. పిల్ల‌ల కోసం స్టెరాయిడ్స్ వాడార‌ని ల‌క్ష్మీపార్వ‌తి మీద అప‌వాదు ఉంది. వాటి ప‌వ‌ర్ ను త‌ట్టుకోలేక చ‌నిపోయాడ‌ని ఆరోపిస్తుంటారు. క‌లియుగ పురుషుడిగా భావించే ఎన్టీఆర్ మ‌ర‌ణం వెనుక ర‌హ‌స్యాలు ఇప్ప‌టికీ పూర్తిస్థాయిలో బ‌య‌ట‌కు రాలేదు. రాజ‌కీయంగా ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ర‌చూ ప్ర‌త్యర్థులు వాడుకుంటున్నారు. ఇక లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ బాల‌యోగి మ‌ర‌ణం వెనుక ప‌లు అనుమానాలు ఆనాడు వ్య‌క్తం అయ్యాయి. ఇవాళ్టికి కూడా ఆయ‌న హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం మీద క్లారిటీ లేదు. ఆ ప్ర‌మాదం వెనుక చంద్ర‌బాబు ఉన్నాడ‌ని కాంగ్రెస్ లీడ‌ర్లు కొంద‌రు మీడియా ముఖంగా అప్ప‌ట్లో ఆరోప‌ణ‌ల‌కు దిగిన సంద‌ర్భాల‌ను చూశాం. రైలు ప్ర‌మాదంలో ఆనాటి మంత్రి దేవినేని ర‌మ‌ణ మ‌ర‌ణం వెనుక కుట్ర ఉంద‌ని ప‌లువురు అనుమానించారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ లీడ‌ర్లు కొంద‌రు దేవినేని ఉమ,చంద్ర‌బాబు మీద ఇప్ప‌టికీ ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. న‌క్స‌ల్స్ మందుపాత‌ర‌కు బ‌లైన ఎలిమినేటి మాధవ‌రెడ్డి మ‌ర‌ణం వెనుక కుట్ర ఉంద‌ని ఇవాళ్టికి కూడా ప‌లువురు భావిస్తుంటారు. ఆ ఘ‌ట‌న వెనుక చంద్ర‌బాబు ఉన్నాడ‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌ర‌చూ ఆరోప‌ణ‌ల‌కు దిగ‌డం విన్నాం.sr

Also Read : Mekapati Goutham Reddy : ‘హ‌ఠాన్మ‌ర‌ణం’పై రాజుకున్న రాజ‌కీయం

త‌మిళ‌నాడు సీఎంగా ఉంటూ ఇటీవ‌ల మ‌ర‌ణించిన జ‌య‌ల‌లిత మ‌ర‌ణాన్ని చూశాం. ఆమె మృతి వెనుక ఏదో జ‌రిగింద‌ని కోర్టుల‌కు వెళ్లారు. సీబీఐ విచార‌ణ ను కూడా కొంద‌రు కోరారు. ఆమె మ‌ర‌ణం వెనుక శ‌శిక‌ళ ఉంద‌ని జ‌య అభిమానులు అనుమానిస్తుంటారు. ఎంజీఆర్‌, క‌రుణానిధి మ‌ర‌ణాల వెనుక కూడా ఏదో జ‌రిగింద‌ని అనుమానించిన వాళ్లు లేక‌పోలేదు. ఇవే కాకుండా కొన్ని ప్ర‌మాదాలు, హ‌త్య‌లు జ‌రిగిన‌ప్పుడు ప‌ర‌స‌ర్ప‌రం రాజ‌కీయ పార్టీలు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం స‌హ‌జంగా మారింది. ఉదాహ‌ర‌ణ‌కు స్వ‌ర్గీయ వైఎస్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం వెనుక ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల కుట్ర ఉంద‌ని ఆనాడు అనుమానించారు. కొన్ని వ్య‌వ‌స్థ‌ల్లోని కీల‌క వ్య‌క్తుల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేతులు క‌లిపి వైఎస్ మర‌ణానికి కార‌ణం అయ్యార‌ని ఆనాడు జ‌రిగిన ప్ర‌చారం. వంగ‌వీటి మోహ‌న్ రంగా హ‌త్య వెనుక టీడీపీ ఉంద‌ని ఇప్ప‌టికీ ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. ఆనాడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ ప్ర‌మేయంతోనే చంద్ర‌బాబు స్కెచ్ వేసిన కార‌ణంగా రంగా హ‌త్య జ‌రిగింద‌ని ఆనాటి కాంగ్రెస్ ఇప్ప‌టి వైసీపీలోని కొంద‌రు లీడ‌ర్లు త‌ర‌చూ చేసే ఆరోప‌ణ‌లు. సంచ‌ల‌నం రేకెత్తించిన ప‌రిటాల ర‌వి హ‌త్య వెనుక వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్కెచ్ వేసి ప‌రిటాల ర‌విని హ‌త్య చేయించాడ‌ని బాబు అనుమానం. ఆ మేర‌కు అసెంబ్లీలో చంద్ర‌బాబు ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించాడు. ఇప్ప‌టికీ అలాంటి ఆరోప‌ణ‌ల‌ను జ‌గ‌న్ మోయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి. ప‌రిటాల హ‌త్య వెనుక చంద్ర‌బాబు కుట్ర కూడా ఉంద‌ని కొంద‌రు ప్రత్య‌ర్థులు చేసే విచిత్ర‌ ఆరోప‌ణ‌. మాజీ ఎంపీ మాగుంట సుబ్బ‌రామిరెడ్డిని మావోస్టులు కాల్చి చంపారు. ఆనాడు కూడా వాళ్ల వెనుక ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్లు అండ‌గా ఉన్నార‌ని అనుమానం ఉండేది. మాజీ ప్ర‌ధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హ‌త్య‌లు జ‌రిగిన క్ర‌మంలోనూ ప్ర‌త్య‌ర్థి పార్టీల ప్ర‌మేయంపై అనుమానాలు రావ‌డం చూశాం. చివ‌ర‌కు 2009లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కు జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం వెనుక కూడా కుట్ర ఉంద‌ని రాజ‌కీయ ఆరోప‌ణ‌లు రావ‌డాన్ని గ‌మ‌నించాం. ఇలా ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా రాజ‌కీయాల‌తో సంబంధం ఉన్న వాళ్లకు ప్ర‌మాదాలు జ‌రిగినా లేదా స‌హ‌జ మ‌ర‌ణం పొందిన‌ప్ప‌టికీ రాజ‌కీయ కోణాన్ని తీయ‌డం ప‌రిపాటిగా మారింది.తాజాగా గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం వెనుక కూడా ఏదో ఉంద‌ని టీడీపీ ఆరోప‌ణ‌లు చేస్తోంది. అసెంబ్లీ వేదిక‌గా కూడా ఆయ‌న మ‌ర‌ణంపై ఉన్న అనుమానాల‌ను ప్ర‌స్తావించాల‌ని భావిస్తోంద‌ట‌.