Delhi: ఢిల్లీలో డేంజర్ బెల్స్, వాయు కాలుష్యంతో సిటీజనం ఉక్కిరిబిక్కిరి!

దీపావళికి ముందే ఢిల్లీలో వాయుకాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

  • Written By:
  • Updated On - November 4, 2023 / 04:15 PM IST

Delhi: దీపావళికి ముందే ఢిల్లీలో వాయుకాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పిల్లలు, పెద్దలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం కష్టంగా మారింది. దీపావళికి ముందే వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత శనివారం “తీవ్రమైన” కేటగిరీలో నమోదైంది. అయితే దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సీజన్ సగటు కంటే ఒక ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఉదయం 9 గంటలకు 407గా ఉంది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ప్రకారం, ఆనంద్ విహార్‌లో 448, వజీర్‌పూర్‌లో 442, పంజాబీ బాగ్‌లో 435, బవానాలో 434, ఓఖ్లాలో 432 మరియు ఆర్‌కె పురంలో 431 నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోని ఏక్యూఐ 377గా నమోదైంది. గ్రేటర్ నోయిడాలో 490, ఫరీదాబాద్‌లో 449, గురుగ్రామ్‌లో 392గా నమోదయ్యాయని సీపీసీబీ తెలిపింది.

భారత వాతావరణ విభాగం (IMD) పొగమంచును అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం 8.30 గంటలకు 88 శాతం తేమ నమోదైంది. ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు పొగమంచుతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.