Dalai Lama: పద్నాలుగో దలైలామా (Dalai Lama) జీవిత చరిత్రకు సంబంధించిన తొలి మూల హిందీ గ్రంథం ఢిల్లీలో ఆవిష్కరణతో సమకాలీన భారత సాహిత్యానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రముఖుల జీవితకథల రచయిత డాక్టర్ అరవింద్ యాదవ్ రచించిన ఈ పుస్తకం న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో విడుదలైంది.
ప్రసిద్ధ రాజనీతజ్ఞుడు, రచయిత పద్మవిభూషణ్ డాక్టర్ కరణ్‌సింగ్ దలైలామా జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ఈ కొత్త పుస్తకం తొలి ప్రతిని పద్మవిభూషణ్ డాక్టర్ మురళీమనోహర్ జోషీకి అందజేశారు. ఢిల్లీ టిబెట్ హౌస్ డైరెక్టర్ గెషే దోర్జీ దందూల్ కూడా దలైలామా అధికార ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మానవ విలువలపై దలైలామా సందేశం విశ్వవ్యాప్తం: డా. కరణ్ సింగ్
సభకు అధ్యక్షత వహించిన డా. కరణ్‌సింగ్ మాట్లాడుతూ.. దలైలామా జీవితం, బోధనలను కళ్లకు కట్టే ఈ గ్రంథం భారత సాహిత్యానికి గొప్ప సంపద అని పేర్కొన్నారు. “దలైలామా జీవితం ఒక ఆధ్యాత్మిక నాయకుని జీవనయానాన్ని మాత్రమే చెప్పదు. శాంతి, కరుణ, మానవ విలువలకు సంబంధించి ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది” అని ఆయన తెలిపారు.
డా. సింగ్.. దలైలామాతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ 1956లో ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తమను పరిచయం చేశారని, అప్పటి నుండి తాము మంచి స్నేహితులుగా ఉన్నామని అన్నారు. ఈ గ్రంథ రచనలో డా. అరవింద్ యాదవ్ విశేష కృషిని ఆయన ప్రశంసించారు. “దలైలామా జీవిత చరిత్ర మొత్తాన్ని హిందీలో రాయడం ద్వారా డా. యాదవ్ గొప్ప సాహసాన్ని ప్రదర్శించారు. ఈ పుస్తకాన్ని అన్ని హిందీ గ్రంథాలయాలకు అందించాలని నేను కోరుకుంటున్నాను” అని డా. సింగ్ ఆకాంక్షించారు.
Also Read: Laddu: అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ లడ్డూలు తినొచ్చు?!
సాధారణంగా కనిపించే దలైలామా గొప్ప బోధనలతో ప్రభావితం: డా. జోషి
దలైలామా ఆధ్యాత్మిక తత్వం, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావంపై డా. మురళీమనోహర్ జోషీ మాట్లాడారు. పైకి సాధారణంగా కనిపించే దలైలామా తన ఘనమైన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, ఆలోచనాపరులు, యువతపై ఎంత గొప్ప ప్రభావం చూపారో వివరించారు. ఈ కొత్త జీవితకథ “భవిష్యత్ తరాలకు ఎంతో విలువైన మూల సంపద” అని డా. జోషీ అభివర్ణించారు.
చైనా దాష్టీకంపై విమర్శలు
టిబెట్ ఎదుర్కొన్న రాజకీయ, సాంస్కృతిక సవాళ్ల గురించి డా. జోషీ ప్రస్తావిస్తూ.. చైనా అనుసరిస్తున్న దుందుడుకు విధానాలు దలైలామాను మాతృభూమిని విడిచిపోయేలా చేశాయన్నారు. “చైనా దాష్టీకాల వల్ల టిబెట్ ప్రజలు తమ మాతృభూమిని వదిలి ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం పొంది జీవించాల్సివస్తోంది. అయినప్పటికీ టిబెట్ తమ పోరాటంలో విజయం సాధిస్తారనే నమ్మకం నాకు ఉన్నది” అని డా. జోషీ పేర్కొన్నారు.
హిందీ, ఇంగ్లిష్, తెలుగు పాత్రికేయరంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అరవింద్ యాదవ్ ఈ గ్రంథ రచనలో ఏ విషయాన్ని అనుసరించడం గాని, అనువదించడం గాని జరగలేదని స్పష్టం చేశారు. దలైలామా, టిబెట్ బౌద్ధానికి సంబంధించిన అనేక మూలాలు, చారిత్రక రికార్డులు, సొంత అనుభవాలు తెలుసుకుని ఆయన ఈ జీవితకథ రచించారు. ఈ పుస్తకంలో దలైలామా జీవితం, టిబెట్ ఆధునిక చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు మొదటిసారి వెల్లడి అవుతున్నాయి. ఇది కేవలం సాహిత్య విజయం మాత్రమే కాదు. టిబెట్ బౌద్ధం, సమకాలీన ప్రపంచ చరిత్రకు సంబంధించిన విశేష సాక్ష్యాధార పత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.
