Financial Crisis: లీటరు పెట్రోలు రూ.283 కోడిగుడ్డు ఒకటి రూ.35

  • Written By:
  • Updated On - March 21, 2022 / 09:53 AM IST

రావణుడు ఏలిన రాజ్యం.. అలో లక్ష్మణా అని ఏడుస్తోంది. కంటికి మింటికి ధారగా కన్నీటి వర్షం కురిపిస్తోంది. పాలకులు చేసిన పాపానికి శ్రీలంక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం కోరలు చాచడంతో.. ఆ దేశంలో ధరలు భగ్గుమంటున్నాయి. శ్రీలంక చరిత్రలో ఎప్పుడూ ఇలా లేదు. అందుకే ఒక్కో కోడు గుడ్డు ధర ఏకంగా రూ.35 పలుకుతోంది.

లీటర్ పెట్రోల్ రేటు రూ.100 దాటేసరికి ఇక్కడ మనకు కాలూచెయ్యి ఆడడం లేదు. అలాంటిది శ్రీలంకలో లీటరు పెట్రోల్ రేటు రూ.283 ఉంది. లీటరు డీజిల్ రేటు రూ.220 ఉంది. అవీ ఇవీ అని కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటుతున్నాయి. కేజీ ఉల్లిపాయలు దాదాపు రూ.250 లకు అమ్ముతున్నారు. కేజీ చికెన్ రేటు మన దగ్గర రూ.300 ఉంటే లబో దిబోమంటున్నాము. అలాంటిది శ్రీలంకలో ఏకంగా రూ.800 ఉంది.

కేజీ గోధుమపిండి మన దగ్గర దాదాపు రూ.60 ఉంటే.. శ్రీలంకలో ఎంత ఉందో తెలుసా? రూ.170-220. ఆహారం ఏదీ లేకపోతే కనీసం గోధుమపిండితో చపాతీలు అయినా చేసుకుని తిందామనుకున్నా.. అది కూడా ఖరీదైన ఆహారంగా మారిపోయింది. కేజీ పాలపొడి రూ.1,945. అసలింత ధర ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? లీటరు కొబ్బరినూనె మన దగ్గర రూ.300-400 మధ్యలో ఉంటుంది. కానీ శ్రీలకంలో మాత్రం దీనికి మూడు రెట్లు ఉంది. దాదాపు రూ.850-900 పలుకుతోంది.

ఏ వస్తువు కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్యులకు సాధ్యం కావడం లేదు. ధరల పెరుగుదల వల్ల నాణ్యమైన ఆహారం తీసుకోలేకపోవడంతో పోషకాహార లోపం తలెత్తుతోంది. ఇప్పటికే డాలర్ తో పోలిస్తే శ్రీలంక రూపాయి మారకపు విలువ ఎంత ఉందో తెలుసా? రూ.270. ఇంధన ధరలు భరించలేనంతగా మారిపోయాయి. దీనికి తోడు గ్యాస్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.