Remal Cyclone : బెంగాల్‌లో తీరం దాటిన రెమాల్ తుఫాను.. ఏమైందంటే..

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, బెంగాల్ ​ సరిహద్దుల్లో తీరం దాటింది.

  • Written By:
  • Updated On - May 27, 2024 / 08:23 AM IST

Remal Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, బెంగాల్ ​ సరిహద్దుల్లో తీరం దాటింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ పరిణామం చోటుచేసుకుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తుఫాను(Remal Cyclone) ప్రభావంతో బంగ్లాదేశ్​, బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపింది. సముద్ర తీరాల్లో గంటకు దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. దీనివల్ల  పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమవడంతో పాటు అనేక చెట్లు కూలిపోయాయని ఐఎండీ చెప్పింది.  దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని గోసాబాలో ఇంటి పైకప్పు కూలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

We’re now on WhatsApp. Click to Join

ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. దీంతో  ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు విఘాతం కలిగింది. ఇంకొన్ని చోట్ల వర్షాలు భారీగా కురుస్తుండటంతో వరదలు చుట్టుముట్టాయి. తుఫాను ముప్పును అంచనా వేసిన బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం నాటికే దాదాపు లక్ష మందిని సముద్ర తీర ప్రాంతాల నుంచి తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించింది. వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. వరద ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రెస్క్యూ టీమ్‌లను రెడీగా ఉంచింది. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు ఇవాళ రాత్రి వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు ఒడ్డుకు తిరిగి రావాలని కోరారు.

Also Read : Royal Enfield: రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మ‌రో క్రేజీ బైక్‌.. లాంచింగ్ ఎప్పుడంటే..?

తుఫాను కారణంగా బెంగాల్‌లోని దిఘా, కక్‌ద్వీప్, జయనగర్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. సోమవారం తుఫాను మరింత బలపడే అవకాశం ఉంది. దీనివల్ల దక్షిణ బెంగాల్ జిల్లాల్లో పెనుగాలులతో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తూర్పు ప్రాంతీయ అధిపతి సోమనాథ్ దత్తా అంచనా వేశారు. ఈనేపథ్యంలో కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్‌లోని జిల్లాల్లో పద్నాలుగు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వం SDRF బృందాలను సిద్ధం చేసింది. రెమల్ తుఫాను కారణంగా కోల్‌కతా, దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాలలో విమాన, రైలు, రోడ్డు రవాణాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. కొన్ని రైళ్లను రద్దు చేశారు. కోల్‌కతా విమానాశ్రయం విమాన కార్యకలాపాలను నిలిపి  వేసింది. కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కూడా కార్యకలాపాలను నిలిపివేసింది. తుఫాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలోని వివిధ ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ముప్పు ఉండటంతో త్రిపుర ప్రభుత్వం సౌత్, ధలై, ఖోవాయి, వెస్ట్  జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read : Rafah : రఫాపై ఇజ్రాయెల్ ఎటాక్.. 35 మంది సామాన్యులు మృతి