Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్‌

  • Written By:
  • Updated On - December 9, 2022 / 09:36 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుపాను (Cyclone Mandus)గా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మాండూస్ (Cyclone Mandus) ప్రభావంతో తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న అర్ధరాత్రి తుపానుగా మారింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గత ఆరు గంటలుగా వాయువ్య దిశలో నిరంతరంగా కదులుతున్న ఈ తుఫాను చెన్నైకి ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.మరోవైపు మాండస్ తుపాను తీవ్ర తుపానుగా మారిందని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది. మాండస్ తుపాను రేపు ఉదయం తీరం దాటనుందని సమాచారం. ఇది వాయువ్య దిశలో కదిలి తమిళనాడులోని పుదువాయి, దక్షిణ ఆంధ్రా తీర ప్రాంతాలకు చేరుకుని రేపు అర్ధరాత్రికి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మధ్య మామల్లపురం వద్ద తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు.

Also Read: Cyclone Mandous : దూసుకొస్తున్న మాండౌస్.. ఈ రోజు రాత్రి తీరాన్ని దాటే అవ‌కాశం

దీని ప్రభావంతో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులతో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, రేపు తమిళనాడులోని ఉత్తర కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడనున్నాయి. ఈ తుఫాను ప్రభావం 210 మండలాల్లో ఉండనున్న నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

తుపాను తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఈనెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. రాష్ట్రంలో తుపాను ప్రభావం చూపే ఆరు జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఏపీ అలర్ట్‌ ద్వారా ఇప్పటికే ఆరు జిల్లాలో హెచ్చరిక సందేశాలు పంపామన్నారు.