Justice Yashwant Varma : దేశ న్యాయవ్యవస్థను కుదిపేసిన ఘోర ఘటన. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై తాజాగా అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు 146 మంది లోక్‌సభ సభ్యులు సంతకం చేసిన అభిశంసన తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ..న్యాయవ్యవస్థలో పారదర్శకత అత్యంత కీలకం. ఇటువంటి ఘటనలపై నిర్దాక్షిణ్యంగా విచారణ జరగాలి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులుగా నియమితులయ్యారు. కమిటీకి పూర్తి విచారణాధికారం ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సమీకరించేందుకు, సంబంధిత వ్యక్తులను విచారించేందుకు కమిటీకి అధికారం ఉన్నదన్నారు. కమిటీ నివేదికను పూర్తి చేసిన అనంతరం ముందుగా స్పీకర్‌కు సమర్పిస్తుంది. ఆ తర్వాత అదే నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టి సభ్యుల ఓటింగ్‌కు పెట్టనున్నట్టు సమాచారం.
నోట్ల కట్టలు మంటల్లో..విచిత్రమైన ఘటన
ఇదంతా ప్రారంభమైన ఘటన 2025 మొదటి త్రైమాసికంలో చోటుచేసుకుంది. అప్పటికి జస్టిస్ యశ్వంత్ వర్మ దిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, ఆయన నివాసంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పుడు, అశేషంగా కాలిపోయిన నోట్ల కట్టలు అక్కడ కనిపించాయి. పెద్ద ఎత్తున నగదు తగలబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో విషయాన్ని తీవ్రంగా తీసుకున్న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, ఒక అంతర్గత విచారణ కమిటీని నియమించారు. ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఆ కమిటీ, తాము సేకరించిన ఆధారాల ప్రకారం, నోట్ల కట్టలు నిజంగా జస్టిస్ వర్మ ఇంట్లోనే తగలబడినవని తేల్చింది.
సుప్రీంకోర్టులో సవాలు, తిరస్కరణ
ఈ నివేదికను జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తాను నిర్దోషి అని, తనపై పెట్టిన ఆరోపణలు నిరాధారమని వాదించారు. కానీ, సుప్రీంకోర్టు ఆయన వాదనను తిరస్కరించింది. కమిటీ నివేదికను సరైనదిగా పరిగణిస్తూ, తదుపరి చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే క్రమంలో పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రారంభమవడం అనివార్యమైంది. స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానిస్తూ అవినీతిపై పోరాటంలో పార్లమెంటు ఐక్యంగా ఉంది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు తప్పనిసరి. ఏ న్యాయమూర్తి అయినా, ఆయన పదవిలో ఉన్నా లేదా రిటైర్డ్ అయినా, చట్టానికి లోబడే ఉంటారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశం,’’ అన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకు ఈ అభిశంసన ప్రక్రియకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.