మోడీ స‌ర్కార్ పై గ‌వ‌ర్న‌ర్ మెరుపుదాడి..వైసీపీలో RRR త‌ర‌హాలో బీజేపీలో మాలిక్

ఒడిస్సా ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ తో క‌లుపుకుని నాలుగేళ్ల‌లో ఐదు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా ప‌నిచేసిన స‌త్య‌పాల్ మాలిక్ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • Written By:
  • Publish Date - October 28, 2021 / 03:45 PM IST

ఒడిస్సా ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్ పోస్ట్ తో క‌లుపుకుని నాలుగేళ్ల‌లో ఐదు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా ప‌నిచేసిన స‌త్య‌పాల్ మాలిక్ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీని, కేంద్రంలోని బీజేపీని రాజ్ భ‌వ‌న్ నుంచి విమ‌ర్శ‌ల‌తో ముంచెత్తుతున్నాడు. సాధార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విలో ఉన్న వాళ్లు రాజ‌కీయాలకు దూరంగా ఉంటారు. ర‌బ్బ‌ర్ స్టాంప్ ల మాదిరిగా గ‌వ‌ర్నర్ల వ్య‌వ‌స్థ ఉంద‌ని చాలా మంది భావిస్తుంటారు. అందుకు భిన్నంగా మేఘాల‌య రాజ్ భ‌వ‌న్ నుంచి గ‌వ‌ర్న‌ర్ మాలిక్ మాత్రం కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా గ‌ళమెత్తాడు. వ‌చ్చే ఏడాది రానున్న‌ యూపీ, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, మ‌ణిపూర్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి త‌ప్ప‌ద‌ని చెబుతున్నాడు. కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అవినీతి గురించి ప్ర‌స్తావిస్తూ మోడీ ప్ర‌భుత్వానికి ప‌క్క‌లో బ‌ల్లెంలా మారాడు.

కేంద్రం నిర్ణ‌యాల‌కు అనుగుణంగా వ్య‌వ‌హరించ‌డంలేద‌ని మాలిక్ ను ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రాష్ట్రాల‌కు బ‌దిలీ చేశారు. తొలుత 2017లో బీహార్ గ‌వ‌ర్న‌ర్ గా మాలిక్ బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. ఆనాడు బీజేపీ, జేడీయూ ఆధ్వ‌ర్యంలో నితీష్ ప్ర‌భుత్వం అక్క‌డ ఉంది. అప్ప‌ట్లో బీహార్ ను కుదిపేసిన సెక్స్ స్కాండిల్ వ్య‌వ‌హారంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ‌లు రాసిన కార‌ణంగా మాలిక్ పై బ‌దిలీ వేటు ప‌డింది. బీహార్ నుంచి జ‌మ్మూక‌శ్మీర్ కు బ‌దిలీ అయ్యాడు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుకు సంబంధించి కేంద్ర ప్ర‌తిపాదించిన ఫైల్ కు అనుగుణంగా వ్య‌వ‌హరించ‌ని మాలిక్ ను గోవా గ‌వ‌ర్న‌ర్ గా పంపారు. అక్క‌డి బీజేపీ పాలిత రాష్ట్రానికి మాలిక్ స‌హ‌కారం ల‌భించ‌లేదు. దీంతో సీఎం ప్ర‌మోద్ సావంత్ ఒత్తిడి మేర‌కు గోవా నుంచి మేఘాల‌య గ‌వ‌ర్న‌ర్ గా బ‌దిలీ అయ్యాడు. కొన్ని రోజులు మాత్ర‌మే సైలెంట్ గా ఉన్న మాలిక్ తాజాగా వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై పోరాడుతోన్న రైతుల‌కు అండ‌గా నిలిచాడు.

మేఘాల‌య గవ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీకరించిన త‌రువాత యూపీలోని ఆయ‌న సొంత ప్రాంతం బాగ్ ప‌థ్ వ‌ద్ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులతో క‌లిసి ర్యాలీ నిర్వ‌హించాడు. యూపీలోని ముజ‌ఫ‌ర న‌గ‌ర్, బాగ్ ప‌థ్‌, మీర‌ట్ జిల్లాల బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇత‌ర ప్రతినిధులపై మండిప‌డ్డాడు. బీజేపీ నేత‌లు జిల్లాల‌కు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నార‌ని మాలిక్ ఆరోపించాడు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని, యూపీ ప్ర‌భుత్వాన్ని దుయ్య‌బ‌ట్టాడు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా యూపీలోని ల‌కీంపూర్ ఖ‌రి ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది రైతులు చ‌నిపోయిన ఘ‌ట‌న‌పై ఘాటుగా స్పందించాడు. అంతేకాదు, గ‌వ‌ర్న‌ర్ ప‌దవికి రాజీనామా చేయ‌డానికి సిద్ధ‌మ‌ని స‌వాల్ విసిరాడు.

సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణం చేసిన 75 ఏళ్ల మాలిక్ ప్ర‌స్థానం చాలా ఉంది. 2004లో బీజేపీలోకి చేర‌క మునుపు చాలా పార్టీల్లో ప‌నిచేశాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఈయ‌నకు రైతు నాయ‌కునిగా పేరుంది. సామాజిక కార్య‌క‌ర్త‌గా మీర‌ట్ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కొచ్చాడు. చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ పెట్టిన భార‌తీయ జ‌న‌తా కాంత్రి పార్టీ నుంచి 1974లో తొలుత ఎమ్మెల్యేగా గెలిచాడు.
1984లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్య‌స‌భకు వెళ్లాడు. ఆ పార్టీకి రాజీనామా చేసి లోక్ దళ్ పార్టీ నుంచి 1989లో అలీఘ‌ర్ లోక్ స‌భ స్థానం నుంచి ఎంపీగా గెలిచాడు. లోక్ స‌భ అభ్య‌ర్థిగా చ‌‌ర‌ణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ పై 2004లో పోటీ చేసి ఓడిపోయాడు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ త‌ర‌పున ఎంపీగా గెలిచి లోక్ స‌భ‌లో మ‌రోసారి అడుగుపెట్టాడు. మోడీ మంత్రివ‌ర్గంలో చోటు సంపాదించాడు. ఆక‌స్మాత్తుగా 2017లో బీహార్ గ‌వ‌ర్న‌ర్ గా ఆయ‌న నియ‌మితుల‌య్యారు. ఆనాటి నుంచి మోడీ ప్ర‌భుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేస్తూ పార్టీలోనూ, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లోనూ కొర‌క‌రాని కొయ్య‌గా మారాడు.
పార్టీలోనే ఉంటూ వైసీపీని ఏ విధంగా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మ‌రాజు టార్గెట్ చేశాడో..అదే త‌ర‌హాలో బీజేపీకి చెందిన మాలిక్ ఆ పార్టీని, మోడీని వెంటాడుతున్నాడు. సో..బీజేపీలోనూ మ‌రో త్రిబుల్ ఆర్ ఉన్నాడ‌న్న‌మాట‌.