Cryonics: మళ్ళి బ్రతుకుతారని, మృతదేహాలను ఇలా..

  • Written By:
  • Updated On - January 5, 2022 / 09:15 PM IST

దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జంగ్ కిల్ తన తల్లి మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రం చేశారు. వందేళ్ల పాటు మృతదేహాన్ని భద్ర పరిచే ఒక సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో మరణించిన వారిని కూడా సైన్స్ బ్రతికించగలదు అనే నమ్మకంతో ఈయన ఇలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా 600 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రం చేశారు. ఒక్క అమెరికాలోనే 250 మృతదేహాలను భద్రపరచారు. ఇప్పటికే 1500 మంది తాము చనిపోయాక తమ మృతదేహాలను భద్రపరచడానికి సౌకర్యాలు సిద్ధం కూడా చేసుకున్నారు.

క్రయానిక్స్ అంటే ఏమిటి?

మరణించిన వారి శరీరం, మెదడు పాడవకుండా వాళ్ల శరీరాలను ఫ్రీజ్ చేసి భద్రపరచడమే క్రయానిక్స్. పేషెంట్ ఏ కారణంతో అయితే చనిపోయాడో, భవిష్యత్తులో మెడికల్ సైన్స్ దానికి పరిష్కారాన్ని కనుగొని, వాళ్లను తిరిగి బతికించడానికి క్రయానిక్స్ ఉపయోగపడుతుందని క్రయానిక్స్ టెక్నీషియన్స్ అంటున్నారు. మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది.

సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. శరీరం పాడవడాన్ని అరికట్టడానికి శరీరానికి ఐస్ బాత్ చేయించాలి. ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు. ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, లిక్విడ్ నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు.

డాక్టర్ జేమ్స్ బెడ్ ఫోర్డ్ అనే వ్యక్తి మృతదేహాన్ని మొట్టమొదటి సారి 1967లో భద్రపర్చారు. మెదడుకు ఎటువంటి డామేజీ కానంతకాలం మనిషిని బతికించకలిగే అవకాశాలు ఉన్నాయ్ అని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఇది కేవలం కొందరు వ్యాపారం కోసమే ఇలాంటివాటిని ప్రోత్సహిస్తున్నారని మరి కొందరు నిపుణులు ఆరోపించారు.