జమ్మూకాశ్మీర్(Jammu and Kashmir )లోని బుద్గామ్ జిల్లా (Budgam District) తంగనర్ కొండల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 181 బెటాలియన్ వాహనం (181st Battalion) ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం పది మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది సీఆర్‌పీఎఫ్‌కు చెందినవారు కాగా, మిగిలిన ఇద్దరు జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖలోని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు జవాన్లకు సాయం చేసారు.
SLBC Meeting : రాష్ట్ర అభివృద్ధి పథంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
గాయపడిన 10 మంది జవాన్లలో తొమ్మిది మంది స్పెషల్ క్విక్ యాక్షన్ టీమ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిని మొదట ఖాన్‌సాహిబ్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తరలించగా, గాయాలు తీవ్రంగా ఉండటంతో వెంటనే శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతం కొండ ప్రాంతమైనందున వాహనం అదుపు తప్పి బోల్తా పడటం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో రోడ్ కండిషన్ బాగోలేకపోవడం లేదా వాహనంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాల్లో రహదారి పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఈ తరహా ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని, జవాన్లు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని అధికారులు పేర్కొన్నారు.