PM Kisan Removals : రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. క్లీన్ అప్ డ్రైవ్ లో భాగంగా తాజాగా మరికొంత మంది రైతుల పేర్లను ఆ స్కీమ్ నుంచి తొలగించారు. దీంతో చాలామంది రైతులు ఈ స్కీమ్ నుంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఒకవేళ మీ పేరు, మీ సంబంధీకుల పేరు కూడా తొలగింపునకు గురైన జాబితాలో ఉందేమో !! వెంటనే చెక్ చేసుకోండి. ఇందుకోసం ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయిన విండోలో బెనిఫిషియరీ లిస్ట్ లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీరు మరో వెబ్ పేజీకి వెళతారు. మీ రాష్ట్ర, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామం వంటి అన్ని అందించి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుంటే సరిపోతుంది.
We’re now on WhatsApp. Click to Join
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో లబ్ధిపొందుతున్న వారిలో అనర్హులైన రైతుల పేర్లను 2021 సంవత్సరం నుంచి విడతలవారీగా తొలగిస్తున్నారు. తాజాగా పీఎం కిసాన్ క్లీన్ అప్ డ్రైవ్ లో భాగంగా మరింత మంది రైతుల పేర్లను తొలగించారు. 2021 నుంచి ఇప్పటి వరకు 1.72 కోట్ల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులను కేంద్రం తొలగించింది. అనర్హులను లిస్ట్ నుంచి తొలగించడం ద్వారా గత మూడేళ్లలో రూ.10 వేల కోట్లను కేంద్ర సర్కారు ఆదా చేసింది. ఈ ఏడాది జులై 27న పీఎం కిసాన్ 14వ విడత నిధులు విడుదల చేశారు. 15వ విడత నిధులను ఈ దీపావళికి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14వ విడతలో కొంత మందికి డబ్బులు అందలేదు. అయితే, అందుకు పలు కారణాలు ఉన్నాయి. రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మీ వివరాలు తప్పుగా ఉన్నా కూడా డబ్బులు బ్యాంకులో పడవు. అందుకే డబ్బులు రాని వారు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయాలి. సమీపంలోని మీసేవా కేంద్రం లేదా ఆన్‌లైన్ సైంటర్ ద్వారా చేసుకోవచ్చు.