Karnataka Polls: కర్ణాటకలో రాజకీయం బుసలు కొడుతోంది. కాంగ్రెస్, బీజేపీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇక సీట్ల కేటాయింపుల అంశంపై ఈ రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిపిఐ ఓ నిర్ణయానికి వచ్చింది. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 215 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్నికలకు సీపీఐ ఇప్పటికే 7 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను కాపాడే దృష్ట్యా మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. ముదిగెరె, అలంద్, జేవర్గి, కుడ్లగి, కేజీఎఫ్, సిమ్, మడికేరి స్థానాల్లో సీపీఐ అభ్యర్థులను నిలబెట్టింది. మేలుకోటేలో సర్వోదయ కర్ణాటక పార్టీ అభ్యర్థికి, బాగపల్లిలో సీపీఐ(ఎం) అభ్యర్థికి సీపీఐ మద్దతిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. మిగిలిన 215 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ఇస్తుంది.
రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపింది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Read More: Balineni Srinivasa Reddy: రాజకీయ విరమణకు మాజీ మంత్రి బాలినేని సై