Site icon HashtagU Telugu

Third Wave: ఫిబ్ర‌వ‌రిలో గ‌రిష్ట‌స్థాయికి చేరుకోనున్న ఒమిక్రాన్ కేసులు

భార‌త‌దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. ఈ నేప‌థ్యంలో కోవిడ్ 19 సూప‌ర్ మోడ‌ల్ క‌మిటీ ఇది థ‌ర్డ్ వేవ్ గా అంచ‌నా వేసింది. దేశంలో ఓమిక్రాన్ రూపంలో మూడవ వేవ్ ఉంటుందని… అయితే సెకండ్ వేవ్ కంటే తక్కువగా ఉంటుందని జాతీయ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ హెడ్‌ అయిన విద్యాసాగర్ తెలిపారు. భారత్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో థ‌ర్డ్ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని…ఇప్పుడు దేశంలో అంద‌రు వ్యాక్సిన్ వేసుకున్నందున రోగనిరోధక శక్తి ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి ఇది సెకండ్ వేవ్ కంటే తక్కువగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఖచ్చితంగా థ‌ర్డ్ వేవ్ అయితే ఉంటుంద‌ని…ప్రస్తుతం రోజుకు దాదాపు 7,500 కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

భారతదేశంలో రెండవ ద‌శ కంటే ఎక్కువ రోజువారీ కేసులు కనిపించే అవ‌కాశం థ‌ర్డ్ వేవ్ లో లేద‌ని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్ సాగ‌ర్ తెలిపారు. సెరో-సర్వే ప్రకారం డెల్టా వైరస్‌తో సంబంధంలోకి రాని ఒక చిన్న భాగం మిగిలి ఉందని…ఇప్పుడు మనకు 75 శాతం నుండి 80 శాతం వరకు సెరో-ప్రాబల్యం ఉందన్నారు. చాలా మంది క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డార‌ని కొద్ది మంది మాత్ర‌మే వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండార‌ని ఆయ‌న తెలిపారు. చాలా మందికి రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టంతో థ‌ర్డ్ వేవ్ లో రోజువారీ కేసులు ఎక్కువ‌గా ఉండ‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.ఫిబ్ర‌వ‌రి నాటికి ఓమిక్రాన్ కేసులు ఎక్కువ‌గా న‌మోదైయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్యానెల్ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌తి ఒక్క‌రు కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు.