Site icon HashtagU Telugu

Covid Cases: కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? నిపుణుల మాటేంటి?

Union Health Ministry

Union Health Ministry

రెండేళ్ల కిందట కరోనా పేరు చెబితే చెమటలు పట్టేవి. ఆ మహమ్మారి ఎక్కడ సోకుతుందో.. ఎక్కడ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందో, ఎక్కడ తమని బలిగొంటుందో అని చాలామంది భయపడేవారు. ఇప్పుడూ కూడా ఇదే అనుమానంతో, భయంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ కరోనా కథ నెమ్మదిగా ముగింపు దశకు చేరుకుంటోందని.. అంతగా భయపడాల్సిన పని లేదని వైద్యనిపుణులు భరోసా ఇస్తున్నారు. కరోనా.. మహమ్మారి దశ నుంచి ఎండమిక్ దశకు చేరుకుంటోంది. అంటే కొన్ని ప్రాంతాలు.. కొంతమందికి మాత్రమే ఇది సోకే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఇది నెమ్మదిగా కనుమరుగు అవుతుంది. అలాంటి దశలో ఉండడం వల్ల కొవిడ్ విషయంలో మరీ భయం అక్కర్లేదంటున్నారు. ఇలాంటి స్టేజ్ లో కొవిడ్ కేసుల్లో పెరుగుదల, తగ్గుదల సాధారణమే అని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ కొంతమంది మాస్కులు ధరించట్లేదని, ఎక్కువమంది ఒకే చోట గుమిగూడడం వంటివి జరుగుతున్నాయని అందుకే కరోనా ఇంకా పెరుగుతోందన్నారు.

ఇప్పటివరకు కరోనాలో సుమారు 1000 మ్యూటేషన్లు జరిగాయి. కానీ అందులో ఐదు మాత్రమే భయంకరమైన ప్రభావాన్ని చూపించాయి. తీవ్రమైన లక్షణాలు కాని, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు కాని ఉంటేనే ఇక కరోనా గురించి భయపడాలని.. అంతేకాని కేసులు పెరిగినంతమాత్రానే ఆందోళన అవసరం లేదంటున్నారు ఎయిమ్స్ వైద్యనిపుణులు. ఇప్పటికే చాలామంది వైరస్ బారిన పడి కోలుకోవడం, వ్యాక్సిన్ లు కూడా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగిందని.. అది చాలాకాలంపాటు వారికి రక్షణ ఇస్తుందన్నారు. శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధుల్లో ఇలా కేసులు పెరగడం, తగ్గడం మామూలే అని క్లారిటీ ఇస్తున్నారు.