Covid : కట్టడిలోకి కరోనా.. దేశంలో కొత్త కేసులు 10 వేలలోపే!

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు..

  • Written By:
  • Publish Date - November 17, 2021 / 12:10 PM IST

దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. తాజాగా 15 శాతం మేర పెరిగాయి. మంగళవారం 12,42,177 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,197 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 5,516 మందికి కరోనా సోకింది. ఇక దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 301 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 210 మరణాలు కేరళలో చోటుచేసుకున్నవే. ఇప్పటివరకు 3.44 కోట్ల మందికి మహమ్మారి సోకగా.. 4,64,153 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గి..527 రోజుల కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం 1,28,555 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.37 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.28 శాతానికి చేరింది. నిన్న 12,134 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 3.38 కోట్లకు చేరాయి. ఇక నిన్న 67,82,042 మంది టీకా వేయించుకున్నారు. దాంతో పంపిణీ అయిన డోసుల సంఖ్య 113 కోట్ల మార్కును దాటింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నుంచి ఘర్‌ ఘర్‌ దస్తక్‌ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు దేశంలోని అర్హతగల జనాభాలో 80 శాతం మొదటి డోసు పొందారని, 38 శాతం రెండో డోసులు పూర్తి చేసుకున్నారని అన్నారు. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ శాతాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.