Pending Bills Issue : రాష్ట్రపతి, గవర్నర్‌లకు రాజ్యాంగం ద్వారా కల్పించిన అధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదని బీజేపీ పాలిత రాష్ట్రాలు స్పష్టంగా పేర్కొన్నాయి. శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును సంప్రదిస్తూ, శాసనసభలు పంపే బిల్లులను ఆమోదించేందుకు తానెంతకాలం సమయం తీసుకోవచ్చో తెలపాలని అభిప్రాయం కోరారు. దాంతో ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చంద్రూర్కర్‌లు సభ్యులుగా ఉన్నారు.
Read Also: BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గోవా, ఒడిశా రాష్ట్రాలు తమ వాదనలను ధర్మాసనం ముందు వినిపించాయి. మహారాష్ట్ర తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు లేదా రాష్ట్రపతికే తుది నిర్ణయం చెప్పే అధికారం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం బిల్లులను ఆమోదించడం, తిరస్కరించడం, లేదా వాటిని తమ వద్ద నిలిపివేయడం రాష్ట్రపతికి లేదా గవర్నర్‌కు మాత్రమే సాధ్యం. కోర్టులకు అలాంటి అధికారం లేదు. కోర్టులు రాజ్యాంగాన్ని తమంతట తాముగా మార్చలేవు. ఈ వ్యవస్థను సమర్థంగా నడిపించేందుకు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని సాల్వే అన్నారు. ఇక, బిల్లుల ఆమోదానికి గడువు విధించడం కోర్టుల పరిధిలోకి రాదని ఆయన స్పష్టంగా చెప్పారు. రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు రాజకీయ సంప్రదింపులు, విశ్లేషణ జరుగుతాయని, ఇది ఒక పరిపక్వమైన ప్రాసెస్ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ధర్మాసనం ఆర్థిక బిల్లుల విషయంలో ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా వాటిని నిరవధికంగా నిలిపితే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రశ్నించగా, ఆర్థిక బిల్లులకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని, వాటిపై నిర్ణయం వేగంగా తీసుకోవడం అవసరమని సాల్వే సమాధానమిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన అంశం కావడంతో, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, న్యాయవర్గాలు ఈ కేసుపై ఆసక్తిగా చూస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయ కోరిన తీరు, దానిపై ధర్మాసనం స్పందన రాజ్యాంగ పరిపాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు తదుపరి విచారణకు తేది ఇంకా ప్రకటించకపోయినా, సుప్రీంకోర్టు తీర్పు భారత రాజకీయ వ్యవస్థ, రాష్ట్రపతి-గవర్నర్ వ్యవహారాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.