అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ విచారణ నిమత్తం కోర్టుకు హాజరయ్యారు. ఆయన భార్య రింకి భుయాన్ శర్మ కూడా న్యాయస్థానానికి వచ్చారు. కామరూప్ మెట్రోపాలిటన్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరయి విచారణ జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించారన్నది వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ.
ఈ దంపతుల ఆధ్వర్యంలో న్యూస్ లైవ్ టీవీ ఛానెల్ పని చేస్తోంది. ఆ ఎన్నికల ప్రచార సమయం ముగిసినా ఓటర్లను ప్రభావితం చేసేలా కార్యక్రమాలను ప్రసారం చేశారంటూ ఎలక్షన్ అధికార్లకు ఫిర్యాదు అందింది. ఆ సమయంలో బిశ్వశర్మ అప్పటి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసేవారు. గడువు ముగిసినా ఓటర్లను ప్రభావితం చేసేలా టీవీలో ప్రసారం చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126(1)(b) ప్రకారం నేరమని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ పార్టీ తన ఫిర్యాదుకు తగిన ఆధారాలను కూడా సమర్పించింది. ఆధారాల్లో వాస్తవాలు ఉన్నాయని భావించిన ఎలక్షన్ అధికారులు ఆ మేరకు కేసు నమోదు చేశారు. 2019 ఏప్రిల్ 11న పోలింగ్ జరగాలి. అయితే 10వ తేదీ సాయంత్రం 7.55 గంటలకు బిశ్వశర్మను లైవ్ లో ఇంటర్వ్యూ చేశారు. ఎన్నికలకు కొద్ది గంటల ముందు ఇలా చేయడం అక్రమమని, ఇది ఓటర్లను ప్రభావితం చేయడానికేనని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా అతిక్రమించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయనను విచారించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని కోర్టు తెలిపింది. మంత్రిగా అధికార హోదాలో ఇంటర్వ్యూ ఇవ్వలేదని, అందుకే కేసు పెట్టడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోనక్కరలేదని స్పష్టం చేసింది.