బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ సంద్రం అలుముకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపుతో పాటు, గెలుపోటములపై ఊహాగానాలు మరింత వేగం అందుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం ఇవ్వకపోవడంతో అన్ని పార్టీల అభ్యర్థులూ తమ గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. ముందుగానే ఓటమిని అంగీకరించేందుకు ఎవ్వరూ సిద్ధంగాలేదు. ఈ ఉత్కంఠభరిత పరిస్థితుల్లో అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు కార్యకర్తలు, నేతల రద్దీతో సందడి అయ్యాయి. ఫలితాలు ప్రకటించక ముందే సంబరాల కోసం భారీ ఏర్పాట్లు మొదలవడం ఎన్నికల హీటును మరింత పెంచింది.
Jubilee Hills Bypoll Election Result : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం.. అభ్యర్థి మృతి
ముఖ్యంగా మోకామా నియోజకవర్గం ఎన్నికల హడావుడిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ జేడీయూ అభ్యర్థి అనంత సింగ్, ఆర్జేడీ అభ్యర్థి వీణా సింగ్ మధ్య కీలక పోరు సాగింది. తన గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేసిన అనంత సింగ్ నివాసంలో ఉదయం 3 గంటల నుంచే వంటలు మొదలయ్యాయి. 56 రకాల వంటకాలతో మహాభోజ్‌కు సన్నాహాలు జరుగుతుండటం, 10,000 లీటర్ల పాల ట్యాంకర్లు, 48 మంది మాస్టర్లు, రెండు లక్షల గులాబ్ జామున్ల తయారీ ఈ వేడుకల విస్తృతి ఏ స్థాయిలో ఉందో చెబుతున్నాయి. కనీసం 50 వేల మందికి విందు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు బీజేపీ క్యాంప్‌లోనూ సన్నాహాలు తారాస్థాయికి చేరాయి. మనేర్ లడ్డూలతో విజయోత్సవాలకు సిద్ధమవుతూ, శతాధిక కిలోల జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్ వంటి పదార్థాలు తెప్పించి ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చారు.
ఇక ఈసారి బీహార్ ఓటర్లు చరిత్ర సృష్టించారు. నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో మొత్తం 67.13 శాతం ఓటింగ్ నమోదు కావడం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికం. బీహార్‌లో ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ జరగడం ఇదే మొదటిసారి. పురుషుల్లో 62.98 శాతం, మహిళల్లో 71.78 శాతం ఓటింగ్ నమోదుకావడం విశేషం. ముఖ్యంగా మహిళా ఓటర్ల అధిక స్పందన ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి రికార్డు స్థాయి పోలింగ్ నేపథ్యంలో, చివరి ఫలితాల దిశ ఎటు ఉంటుందో అన్న ఉత్కంఠ మరికొన్ని గంటల్లో ముగియనుంది.
