Site icon HashtagU Telugu

Election Result 2022: ఐదు రాష్ట్ర‌ల ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. గెలుపు గుర్రాలు ఎవ‌రో..?

2022 Elections Counting

2022 Elections Counting

ఇండియాలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ క్ర‌మంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధమయింది. దీంతో మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు, అక్క‌డి అధికారులు అంతా సిద్ధం చేశారు. ఈ క్ర‌మంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ ఫలితాల కోస‌మే అంద‌రూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్కించి, ఆత‌ర్వాత ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో తెరిచి కౌంటిగ్‌ను స్టార్ట్ చేస్తారు. ఈ క్ర‌మంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ :

ఇక 403 సీట్లున్న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మ‌రోసారి బీజేపీ విజ‌భేరి మోగిస్తుందని ఇటీవ‌ల విడుద‌లైన అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థ‌లు త‌మ అంచ‌నాల‌ను విడుద‌ల చేశాయి. బీజేపీకి 228 నుంచి 240 సీట్ల‌లో గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. సమాజ్ వాదీ పార్టీ 132 నుంచి 148 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే చాన్స్ ఉంద‌ని, బీఎస్పీ 14 నుంచి 21 సీట్లలో గెలిచే అవ‌కాశం ఉంద‌ని, కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అవుతోంద‌ని, ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 10 సీట్లు మాత్ర‌మే వ‌చ్చే చాన్స్ ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే అక్క‌డ బీజేపీకి స‌మాజ్ వాదీ పార్టీ నుంచి గ‌ట్టి పోటీ ఎదురు కానుంద‌ని, అయితే అక్క‌డ అధికారం చేప‌ట్టేది మాత్రం మ‌రోసారి బీజేపీనే అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.

పంజాబ్ :

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ హవా కనిపించబోతోందని స‌ర్వేలు తేల్చాయి. ఈ క్ర‌మంలోమొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో తాజా అంచనాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 51 నుంచి 61 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 28 సీట్లకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయ‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.

గోవా :

ఇక 40 స్థానాలు ఉన్న‌ గోవాలో హంగ్ దిశగా ఫలితాలు వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అక్క‌డ జాతీయ పార్టీలు అయిన‌ బీజేపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ‌ కాంగ్రెస్ పార్టీ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చని, ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు వరకు పెరగవచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అలాగే ప్రాంతీయ మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఈసారి మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ ఇప్పుడు కీలకం కానున్నట్టు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకోనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఏపార్టీకి రాద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.

ఉత్తరాఖండ్ :

70 స్థానాలు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నెలకొంద‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. బీజేపీ 26- 32 స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ 32-38 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంద‌ని, ఆమ్‌ఆద్మీ 0-2 స్థానాలు గెలవొచ్చ‌ని, అలాగే ఇతరులకు 3-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. దీంతో ఉత్త‌రాఖండ్‌లో కూడా ఏపార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌నేది ఇప్పుడు ఆశ‌క్తిగా మారింది.

మణిపూర్ :

60 స్థానాలు ఉన్న మ‌ణిపూర్‌లో కాంగ్రెస్ 12 నుంచి 16 స్థానాలు గెలుచుకోవచ్చని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. బీజేపీ భాజపాకి 23 నుంచి 27 స్థానాలు గెలుపొందే చాన్స్ ఉంద‌ని, దీంతో మ‌ణిపూర్‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక‌ నేషనల్ పీపుల్స్ పార్టీ 10 నుంచి 14 స్థానాలు, ఎన్ పీఎఫ్ 3 నుంచి 7 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంద‌ని, ఇతరులు 2-6 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.