Gujarat Election Results: నేడే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

  • Written By:
  • Publish Date - December 8, 2022 / 07:35 AM IST

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ (Gujarat, Himachal Pradesh Election Results) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు (గురువారం) వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గుజరాత్‌(Gujarat)లో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ గెలిస్తే బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్రంట్‌ వరుసగా ఏడు విజయాల రికార్డును సమం చేస్తుంది. అదే సమయంలో హిమాచల్‌(Himachal Pradesh)లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్‌ జరుగుతోంది.

హిమాచల్‌లో నవంబర్ 12న 68 స్థానాలకు, గుజరాత్‌లో 182 స్థానాలకు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. హిమాచల్‌లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో మెజారిటీ మార్కు 35 కాగా, బీజేపీ 44 సీట్లు గెలుచుకుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలు, మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా నేడు జరగనుంది. యూపీలోని రాంపూర్‌తోపాటు ఖతౌలీ, ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుధాని, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈరోజే వెలువడనున్నాయి.

Also Read: AAP: 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీలో ఆప్ విజయం..!

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని 182 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌స్పెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులను నియమించినట్లు గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భారతి తెలిపారు. ఇందుకోసం 182 మంది కౌంటింగ్ ఇన్‌స్పెక్టర్లు, 494 మంది సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. గుజరాత్ లో మొత్తం 182 స్థానాలకు రెండు దఫాల్లో పోలింగ్ జరిగింది. ఈరోజు ఓట్ల లెక్కింపు కోసం 32 కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గుజరాత్‌లో అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ 92 సీట్లు కాగా.. బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.