Corona Turmoil Again : మళ్లీ కరోనా కల్లోలం.. రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయా?

ప్రజల్లో మళ్ళీ కరోనా (Corona) భయం కారు మేఘంలా కమ్ముకుంటోంది. ఇప్పటికే కోవిడ్ -19 వైరస్ 2019, 20ల లో అల్లకల్లోలం సృష్టించింది.

  • Written By:
  • Updated On - December 20, 2023 / 11:50 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Corona Turmoil Again : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కలకలం రేగింది. ప్రపంచంలో 38 దేశాల్లో ప్రస్తుతం ఈ కరోనా వేరియంట్ వ్యాప్తి చెందినట్లుగా సైంటిస్టులు చెప్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. కేరళ, కర్ణాటక మొదలైన రాష్ట్రాల్లో ఇప్పటికే కేసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. అందుకే ప్రజల్లో మళ్ళీ కరోనా (Corona) భయం కారు మేఘంలా కమ్ముకుంటోంది. ఇప్పటికే కోవిడ్ -19 వైరస్ 2019, 20ల లో అల్లకల్లోలం సృష్టించింది. తర్వాత దానికి మరో రూపాలైన డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలను భయభ్రాంతులను చేసి నిలువునా వణికించాయి. ఇప్పుడు మళ్లీ కరోనా (Corona) అంటే మన దేశమే కాదు, యావత్తు ప్రపంచం గడగడలాడిపోతోంది. ధనిక దేశాలు, సమృద్ధి చెందిన దేశాలు ఎంతటి విపత్తునైనా ఎదుర్కొంటాయి. కొంత ప్రాణ నష్టాన్ని చవిచూసినా, అమెరికా బ్రిటన్ జన్మని ఫ్రాన్స్ ఇటలీ లాంటి సంపన్న దేశాలు అతి త్వరగా కరోనా భూతాన్ని అదుపులోకి తీసుకురాగలిగాయి. భారతదేశం లాంటి పేద దేశాలు మాత్రం కనీవినీ ఎరుగని నష్టాన్ని చవిచూశాయి.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా మన దేశం ప్రభుత్వ లెక్కలు పక్కన పెడితే, లక్షల సంఖ్యలో ప్రాణనష్టాన్ని చూసింది. వేసిన వ్యాక్సిన్లు సరైనవా కాదా అన్న పెద్ద దుమారం కూడా చెలరేగింది. అయినా 90% పైగా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకొని మెడికల్ సైన్స్ పట్ల తమ నిబద్ధతను చాటి చెప్పారు. నాటు వైద్యాలు, ప్రకృతి వైద్యాలు, అభూత కల్పనల భూత వైద్యుల అశాస్త్రీయ వైద్యాలు ఎన్నెన్నో మనమంతా చూశాం. ఏ మందూ పనిచేయదని చివరికి శాస్త్రీయమైన మెడికల్ సైన్స్ ఒక్కటే మనకు దిక్కని పరమ భక్తుల నుండి పరమ నాస్తికులు వరకు అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు. దీపాలు వెలిగించమని, తపేలాలు మోగించమని చెప్పిన పెద్ద తలకాయలు శాస్త్ర విజ్ఞానం ముందు తలదించుకోవాల్సి వచ్చిన జ్ఞాపకాలు కూడా మనకు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి కరోనా భూతం నేనున్నానంటూ కోరలు చాపి భయపెట్టడానికి సిద్ధపడింది. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.

తాజా కరోనా వేరియంట్ దాదాపు 38 దేశాల్లో తలెత్తినట్లు, ఇది ఓమిక్రాన్ వేరియంట్ కి మరో మరో రూపంగా సైంటిస్టులు చెప్తున్నారు. మనదేశంలో హెచ్-1, జె.ఎన్-1,ఇ.జి-5 వేరియంట్లు వ్యాప్తి చెందినట్లు చెప్తున్నారు. ఒక్క డిసెంబర్ నెలలోనే ఒక్కో వారానికి కేసుల సంఖ్య రెండింతలు మూడింతలుగా మారడం కనిపిస్తోంది. డిసెంబర్ 3న కేవలం 59 కేసులు ఉంటే అవి డిసెంబర్ 10 నాటికి 250 దాటినట్టు, డిసెంబర్ 17 నాటికి 400 పైచిలుకు చేరుకున్నట్టు అటూ ఇటుగా కొన్ని లెక్కలు కనిపిస్తున్నాయి. అయితే మరణం రేటు మాత్రం 0. 8% గా ఉన్నట్టు చెప్తున్నారు. ఇది గతంలో మనం చూసిన ఓమిక్రాన్ వేరియంట్ కి రెండు మూడు వేరియంట్ల మారు రూపంగా కనిపిస్తున్నట్టు శాస్త్రజ్ఞుల అంచనా. కనుక ఈ వైరస్ సోకినా ప్రాణ భయం ఉండదని చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వారం వారం కేసులు రెట్టింపు అవుతున్న పరిస్థితి చూస్తుంటే మరోసారి దేశాన్ని అంతా ఈ వైరస్ కమ్ముకునే అవకాశాలు లేకపోలేదు. అందుకే మెడికల్ సైన్స్ ఎన్ని పరిశోధనాలు చేసినా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నో అనుభవాలు చవిచూశాం. ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్నాం.

సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కరోనా వైరస్ మృత్యు తాండవాన్ని అతి దగ్గరగా చూశారు. అందుకే గత అనుభవాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వాలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ మందుల విషయంలో, ఆసుపత్రులలో ఆక్సిజన్, పడకలు తదితర సదుపాయాల విషయంలో ఎంత జాగ్రత్తగా మెలకువగా ఉన్నాయో ఎవరికి వారే భరోసా చెప్పుకోవాల్సిన సమయం ఇది. ప్రభుత్వాల మాట ఎలా ఉన్నా, మందులు, ఆసుపత్రులు, సదుపాయాలు మాట ఎలా ఉన్నా, ప్రజలు మాత్రం తాము తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు, డాక్టర్లు, సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా ఇలాంటి వైరస్ కు త్వరగా లొంగిపోయే అవకాశం ఉంటుంది. వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే పౌష్టికాహారం తీసుకోవడం, విటమిన్స్, మినరల్స్ సమతుల్యంతో తీసుకోవడం మనం పాటించే జాగ్రత్తల్లో అతి ముఖ్యమైన జాగ్రత్తగా భావించాలి. ఇప్పుడు కనిపిస్తున్న వైరస్ వేరియంట్ ఎంత ప్రమాదకరమైందో, అది విశ్వరూపం దాల్చిన తర్వాత గాని తెలియదు. అందుకే కీడెంచి మేలెంచాలి. ఎవరి జాగ్రత్తలో వారుండాలి. గతం కంటే భయంకరంగా ఈ వైరస్ విజృంభించినా, గతం కంటే ధైర్యంగా ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి.

Also Read:  Modi Vs Kharge : ఖర్గే వర్సెస్ మోడీ.. ప్రధాని అభ్యర్ధి ఛాన్స్ కాంగ్రెస్ చీఫ్‌కేనా ?