Site icon HashtagU Telugu

Congress’s 4 questions to PM Modi : ప్రధాని గారూ కాస్త సెలవిస్తారా? కాంగ్రెస్ అడుగుతోంది

Congress Questions To Modi

Congress Questions To Modi

డా. ప్రసాదమూర్తి

మణిపూర్ (Manipur) లో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలకే అక్కడ అల్లకల్లోల (violence in Manipur) పరిస్థితులు నెలకొనడం మొదలైంది. మే నెల ప్రారంభంలో అక్కడ జాతుల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణ రావణ కాష్ఠంలా మండుతూనే ఉంది. ఈ మధ్యనే కొంచెం చల్లారినట్టు కనిపించినా, అది మళ్ళీ రగులుకుంది. రాష్ట్రంలో పునరుద్ధరించిన ఇంటర్నెట్ సేవలను తిరిగి నిషేధించాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ మణిపూర్ నుంచి హింసాత్మక ఘటనల వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ఎందుకు ఇంత ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, ఆయన ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ (Congress Party) నిలదీస్తోంది. మణిపూర్ లో ఇంత అమానవీయమైన అమానుషమైన హింసకాండ కొనసాగుతున్నా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందని ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. ఇందులో ప్రధాని మోడీ పాత్ర మరింత బాధ్యతా రహితంగా ఉందని కాంగ్రెస్ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రమైన విమర్శ చేసింది. మణిపూర్ లో చెలరేగిన ఈ హింసకాండ నేపథ్యంలో ప్రధానమంత్రి ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించలేదు. ఆ ఘటనల పట్ల ఆయన నోరు విప్పి మాట్లాడింది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. పార్లమెంట్లో కొన్ని నిమిషాలు మణిపూర్ ఘటన గురించి ఆయన మాట్లాడిన మాటలు కేవలం భావోద్వేగాపూరితమైనవే గాని సమస్యకు పరిష్కారాన్ని చూపే నిజాయితీని నిబద్ధతను ప్రదర్శించినవి కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

మణిపూర్ ఘటనల పట్ల ప్రధాని పాత్రను వేలెత్తి చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ తాజాగా నాలుగు ప్రశ్నలను (Congress’s 4 questions to PM Modi) సంధించింది. ఈ ప్రశ్నలతో కూడిన ఒక లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి జయరాం రమేష్ విడుదల చేశారు. ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్ర ప్రజలను ఇంతగా ఏకాకిని చేసిన ప్రధానమంత్రి ఎవరూ లేరని ఆయన ఆ లేఖలో విమర్శించారు. మణిపూర్ జాతుల ఘర్షణ, బిజెపి మాటిమాటికీ ఊదరగొడుతున్న డబుల్ ఇంజన్ సర్కార్ ‘విభజించు పాలించు’ రాజకీయాల ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి మణిపూర్ వెళ్ళలేదు. హోం మంత్రి అమిత్ షా కూడా అక్కడ అల్లర్లు చెల్లరేగిన నెలరోజుల తర్వాత, అది కూడా కర్ణాటక ఎన్నికల పర్యటనలు ముగించుకొని నింపాదిగా మణుపూర్ వెళ్లారు. ఆ పర్యటన కూడా మణిపూర్ పరిస్థితులను చక్కదిద్దడంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ నిజమేనని వాస్తవాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పైసంధించిన నాలుగు ప్రశ్నలను ఒకసారి చూద్దాం.

1. ప్రధానమంత్రి మణిపూర్ నుంచి ఆఖరుసారి సందర్శించింది ఎప్పుడు?

2. మణిపూర్ లోని బిజెపి ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి ఆఖరిసారిగా మాట్లాడింది ఎప్పుడు?

3. మణిపూర్ లోని బిజెపి ఎమ్మెల్యేలతో ప్రధానమంత్రి ఆఖరిసారిగా కలిసింది ఎప్పుడు?

4. ప్రధానమంత్రి తన క్యాబినెట్ తో మణిపూర్ సమస్య గురించి ఆఖరి సారిగా చర్చించింది ఎప్పుడు?

ఇవీ కాంగ్రెస్ పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంధించిన నాలుగు ప్రశ్నలు. ఆగస్టు పదవ తేదీన లోక్ సభలో నరేంద్ర మోడీ చేసిన 133 నిమిషాల ప్రసంగంలో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మణిపూర్ గురించి మాట్లాడారు. అంతే తప్ప ఆయన మరెక్కడా మరెప్పుడూ మణిపూర్ ప్రస్తావన తీసుకురాలేదు. దేశంలో అతి కీలక భాగమైన ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన మణిపూర్ రాష్ట్రాన్ని ఇలా గాలికి వదిలేయడం ఒక ప్రధానమంత్రికి తగదని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్షాలు మాత్రమే కాదు, బాధ్యత గల ప్రతి పౌరుడూ అడుగుతున్న ప్రశ్న. మరి దీనికి ప్రధాని నరేంద్ర మోడీ గాని, ఆయన మంత్రివర్గ సభ్యులు గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఏం సమాధానం చెబుతారో చూడాలి. సమస్యకు సమాధానం చెప్పడం కాకుండా సమస్యను దారి మారల్చడానికి మరో సమస్యను సృష్టించడంలో మన నాయకులు ఆరితేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంధించిన ఈ నాలుగు ప్రశ్నలను కూడా తిప్పి కొట్టడానికి మరికొన్ని ప్రశ్నలను అధికార పార్టీ వారు తమ రోజువారీ రాజకీయ కర్మాగారంలో తయారు చేస్తున్నారేమో చూడాలి.

Read Also : Worl Cup 2023: చెలరేగి ఆడుతున్న కివీస్‌ బ్యాటర్లు