Site icon HashtagU Telugu

Congress Workers Clash : రాహుల్ యాత్రలో ఉద్రిక్తత.. బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ క్యాడర్ ఏం చేసిందంటే..

Congress Workers Clash

Congress Workers Clash

Congress Workers Clash : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అసోంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా మంగళవారం రోజు  రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను గువాహటిలోకి అనుమతించకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్​కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఖానాపారాలోని గువాహటి చౌక్​ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ అనుకూల నినాదాలు చేస్తూ రాహుల్​కు స్వాగతం పలికారు.ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి కాంగ్రెస్ శ్రేణులను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఈ బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లను తోసుకుంటూ.. యాత్రలో ముందుకు దూసుకెళ్లారు.

We’re now on WhatsApp. Click to Join.

తమ పార్టీ కార్యకర్తలు బారికేడ్లు మాత్రమే ఛేదించుకొని వెళ్లారని.. చట్టాన్ని అతిక్రమించలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ‘‘మేం యాత్ర చేయనున్న గువాహటి నగర రూట్‌లోనే ఇటీవల భజరంగ్ దళ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ర్యాలీలు చేశారు. వాళ్లకు చెప్పని అభ్యంతరం, మాకు మాత్రం ఎందుకు చెప్తున్నారు. మేం కాంగ్రెస్ కార్యకర్తలం. మేం బలంగా ఉన్నాం. మేం బారికేడ్లను పగలగొట్టాం. కానీ చట్టాన్ని విస్మరించలేదు’’ అని ఆయన తెలిపారు. ‘పోలీసుల బారికేడ్లు తొలగించుకొని వచ్చాం(Congress Workers Clash). మేం గెలిచాం’ అని అసోం ఏఐసీసీ ఇంఛార్జ్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో గువాహటిలోకి రాహుల్ గాంధీ యాత్రను అనుమతించలేమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇదివరకు ప్రకటించారు.

అమిత్ షా ఫోన్ కాల్ వల్లే నన్ను అడ్డుకున్నారు 

అంతకుముందు అసోం-మేఘాలయ సరిహద్దులో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘‘దేశంలోని విద్యార్థులను బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే మేఘాలయలో విద్యార్థులను కలవకుండా నన్ను అడ్డుకున్నారు. అసోం సీఎంకు అమిత్ షా ఫోన్ చేసి నన్ను అడ్డుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో రాహుల్ గాంధీ మాట్లాడకూడదని అసోం ముఖ్యమంత్రికి ఈ దేశ హోంమంత్రి చెప్పారట. యూనివర్సిటీ అధికారులకు సీఎం ఫోన్ చేసి మాట్లాడారు. రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం అనేది ముఖ్యం కాదు. విద్యార్థులు తమకు నచ్చిన వ్యక్తి ప్రసంగాన్ని వినడం ముఖ్యం. అసోంలోని ఏ విద్యాసంస్థలోనూ విద్యార్థులకు ఈ స్వేచ్ఛ లేదు. మీ భాష మాట్లాడకూడదు, మీరు సొంత చరిత్ర కలిగి ఉండకూడదు’’ అని ఆయన చెప్పారు. ‘‘విద్యార్థులారా  మీకు నచ్చిన భాషలో చదువుకోకుండా ఎవరూ ఆపలేరు. మీకు నచ్చిన మతాన్ని విశ్వసించకుండా ఎవరూ నిలువరించలేరు. యూనివర్సిటీలో విద్యార్థులతో జరగాల్సిన నా కార్యక్రమాన్ని వారు అడ్డుకున్నారు. కానీ మీరు యూనివర్సిటీ బయట నా ప్రసంగం వినేందుకు వచ్చారు. విద్యార్థులు ఎవరికీ భయపడకూడదు. మీరే ఈ దేశానికి భవిష్యత్తు’’ అని రాహుల్ తెలిపారు.

Also Read: Lok Sabha Polls : ఏప్రిల్ 16.. లోక్‌సభ పోల్స్ తేదీపై క్లారిటీ ఇచ్చిన ఈసీ