Target Killings In Kashmir: కాశ్మీరీ పండిట్ల దుస్థితిపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.!!

  • Written By:
  • Publish Date - October 27, 2022 / 07:48 PM IST

మోదీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా నుంచి కశ్మీరీ పండిట్ల వలసపై బీజేపీని లక్ష్యంగా చేసుకుంది కాంగ్రెస్. 8ఏళ్ల పాలనలో కశ్మీరీ పండిట్ల దుస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ మోదీ సర్కార్ ను డిమాండ్ చేసింది. జమ్మూ కశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంపై బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరింది.

ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 80మంది కశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు కశ్మీర్ పండిట్లను ఎంచుకుని మరీ హత్యచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్ల కుటుంబాలు షోఫియాన్ జిల్లాలోని చౌదరికుండ్ నుంచి జమ్మూకి వలసపోయారని పేర్కొంది. అయితే కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలను జిల్లా యంత్రాంగం ఖండించింది. కశ్మీరీ పండిట్లను వలసవెళ్లడం లేదని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియాసమావేశంలో కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం నేత పవన్ ఖేరా మాట్లాడారు. 1989లో కశ్మీరీ పండిట్లు తొలిసారిగా లోయ నుంచి వలస వచ్చినప్పుడు వీపీ సింగ్ ప్రభుత్వం అధికారంలోఉందని…దానికి బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. 1986లో కశ్మీరీ పండిట్లపై దాడులు జరిగినప్పుడు కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అధికారంలో ఉందని…కశ్మీరీ పండిట్ల సమస్యలను విని గులాం మహ్మద్ షా ప్రభుత్వాన్ని రద్దు చేశారని వెల్లడించారు. బీజేపీ కేవలం జీరో టాలరెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతుందని..రాజీవ్ గాంధీ చేసి చూపించారన్నారు.