ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి భారీ షాక్ ఇచ్చారు ఓటర్లు. రెండేళ్లు విజయం అందించిన ఓటర్లు ఈసారి తిరస్కరించి. 27 తర్వాత బిజెపి(BJP)కి విజయం అందించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కానీ ఆప్ ఓటమికి కారణమైందంటూ కాంగ్రెస్ పై విమర్శలు వస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్‌కు గండికొట్టినట్టుగానే, ఢిల్లీలో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ఆప్‌కు ఎదురుదెబ్బ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు పలు నియోజకవర్గాల్లో పోటీ చేసి, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చారు. ఫలితంగా బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అదే తీరును ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి పెద్దగా ప్రభావం లేకపోయినా, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఆప్ విజయంలో అడ్డుకట్ట వేసింది. ముఖ్యంగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఓటమికి కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కీలక భూమిక పోషించాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఆప్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభావం తగ్గుతుందనే అంచనాతో ఆ పార్టీ వ్యూహాత్మకంగా పని చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ గెలవకపోయినా, ఆప్ ఓడిపోవడం ద్వారా తన భవిష్యత్తు దిశగా మార్గం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
కేజ్రీవాల్ విజయాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇండియా కూటమిపై తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికీ కాంగ్రెస్ ఈ వ్యూహం రచించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్యానా ఎన్నికల్లో మిగిలిన పార్టీలు తనకు ఎలా నష్టం చేసాయో, అదే విధంగా ఢిల్లీలో తాను తిరిగి ప్రతీకారం తీర్చుకున్నట్లు కాంగ్రెస్ ఆలోచన చేసినట్లు అంత మాట్లాడుకుంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేకపోయినా, ఆప్‌ను ఓడించడంలో మాత్రం తన వ్యూహం విజయవంతమైందని చెబుతున్నారు. అయితే ఈ పోటీ రెండు పార్టీలకు నష్టమే తెచ్చిపెట్టిందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.