Site icon HashtagU Telugu

Congress: సోనియా గాంధీని కలిసిన గులాం నబీ ఆజాద్.. ఆ విష‌యాల‌పైనే చ‌ర్చ‌..?

Sonia Azad

Sonia Azad

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఆమె నివాసంలో క‌లిశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పరాజయం తర్వాత కాంగ్రెస్‌లో పునరుద్ధరణ కోసం G-23 నాయకుల పిలుపు మధ్య, పార్టీలో అంతర్గత సంఘర్షణను పరిష్కరించడానికి ఆజాద్ 10 జన్‌పథ్‌లో సోనియాగాంధీని కలిశారు. సోనియా గాంధీతో సమావేశం బాగుందని.. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఆమె అధ్యక్షురాలిగా కొనసాగాలని ఏకగ్రీవంగా నిర్ణయించారని.. తాను కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని కూడా చర్చించినట్లు ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి సోనియా గాంధీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని… కొన్ని రోజుల క్రితం వర్కింగ్ కమిటీ సమావేశమై, కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి.. ఓటమికి కారణాలు ఏమిటి (ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో) సూచనలు అడిగారని.. త‌న సలహాలు కూడా ఇచ్చానని ఆజాద తెలిపారు.

అంతకుముందు గురువారం హర్యానా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా రాహుల్ గాంధీని కలిశారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆజాద్ నివాసంలో జరిగిన గ్రూప్ సమావేశం తర్వాత G-23 నాయకుడు హుడా, కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులను మొదటిసారిగా సంప్రదించారు. G-23 నేతల సమావేశం, వారి తీర్మానంపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. బుధవారం ఆజాద్ నివాసంలో జరిగిన సమావేశం తరువాత, G-23 నాయకులు కాంగ్రెస్‌లో సమిష్టి నాయకత్వం ఉండాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీని ఎదుర్కోవాలంటే, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీని ఇతర భావ సారూప్య శక్తులతో చర్చలు ప్రారంభించాలని కోరుతున్నామని జీ23 నేతలు తెలిపారు.