Site icon HashtagU Telugu

Congress Suffers: కాంగ్రెస్ కు క్రాస్ ఓటింగ్ భయం!

Congress Resort Politics In Goa

Congress Resort Politics In Goa

రాజ్యసభ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న భయం కాంగ్రెస్ వెంటాడుతోంది. అందుకే రాజస్థాన్ లో ఉదయ్ పూర్ హోటల్లో సుమారు 70 మంది ఎమ్మెల్యేలను ఉంచింది. క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్న వేళ వారంతా బీజేపీ వలలో చిక్కకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ్యుల సంఖ్య 108. ఈ బలంతో ఆ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించగలదు. ఇంకా 26 ఓట్లు మిగిలిపోతాయి. మూడో స్థానంలో గెలవాలంటే దానికి 41 ఓట్లు కావాలి. అంటే ఇప్పుడు మిగిలిపోయిన 26కు అదనంగా మరో 15 ఓట్లు కావాలి. కానీ కాంగ్రెస్ అక్కడ మద్దతు దొరకడం కష్టమవుతోంది. అయినా సరే మూడో అభ్యర్థిని బరిలోకి దించింది. ఆ పార్టీ తరుపున రణదీప్ సూర్జేవాలా, ప్రమోదీ తివారీ, ముకుల్ వాస్నిక్ లు పోటీ చేస్తున్నారు.

ఇక బీజేపీకి 71 మంది శాసనసభ్యులు ఉన్నారు. దీంతో ఒక స్థానంలో ఈజీగా గెలుస్తుంది. ఇంకా 30 ఓట్లు మిగిలిపోతాయి. అంటే అదనంగా మరో స్థానంలో గెలవాలంటే ఇంకా 11 ఓట్లు కావాలి. ఇప్పటికే బీజేపీ తరుపున మాజీ మంత్రి ఘనశ్యామ్ తివారీ పోటీలో ఉన్నారు. రెండో స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా సుభాష్ చంద్రకు బీజేపీ మద్దతిస్తోంది. ఆయన గెలవాలంటే.. అవతలిపార్టీ ఓట్లు కావాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ ముందే జాగ్రత్తపడింది. పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మొత్తానికి బుజ్జగించగలిగారు. వారిని కూడా క్యాంపు కార్యాలయానితి తరలించారు. బీజేపీ తమ అభ్యర్థులకు ఎర వేస్తోందని రాజస్థాన్ పీసీసీ.. ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో రాజస్థాన్ రాజకీయం రంజుగా మారింది.