PM Modi : బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. తాజా పర్యటనలో సివాన్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన మోడీ, విపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై తీవ్రంగా మండిపడ్డారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ..బిహార్‌ను ఎన్నో దశాబ్దాల పాటు పేదరికంలో ఉంచినది కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల పాలన. లైసెన్స్ రాజ్ పేరుతో బిహార్‌ను వెనుకబాటుకు నెట్టేశారు. ఇందులో దళితులు, పేదలు అత్యంత బాధితులుగా మిగిలిపోయారు అన్నారు.
Read Also: Bomb Threat : హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు
అలాగే, మర్హౌరాలో నిర్మిస్తున్న రైల్వే ఫ్యాక్టరీను ఆయన అభివృద్ధి చిహ్నంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడిన సరన్ జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ తయారవుతున్న ఇంజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇది బిహార్ అభివృద్ధికి నిదర్శనం. జంగిల్ రాజ్ అన్న పేరుతో బిహార్ ఎన్నాళ్ళు వెనుకబడిందో మర్చిపోలేం. కానీ ఇప్పుడే అదే బిహార్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోంది అని తెలిపారు. ఎన్డీయే సర్కార్ ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ కోసం పని చేస్తుంటే, ఆర్జేడీ-కాంగ్రెస్ మాత్రం తమ కుటుంబాల అభివృద్ధికే పరిమితమయ్యాయి. ‘పరివార్ కా సాత్’ అనే విధానాన్ని అవలంబించేవారికి ప్రజల సమస్యలు తెలిసినవే కావు. వారి పాలనలో నాయకుల కుటుంబాలే కోటీశ్వరులు అయ్యారు. సామాన్యులు మాత్రం ఎన్నడూ పేదరికం నుంచి బయటపడలేకపోయారు అని ఆరోపించారు.
మోడీ వెల్లడించిన విధంగా, రానున్న కాలంలో మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మేము చెప్పేది కాదు, చేస్తున్నదే ప్రామాణికం. అభివృద్ధి మా సంకల్పం. ప్రజల కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. ప్రజాసేవే నా ధ్యేయం. పనిచేయకుండా నిద్రపోలేను అని అన్నారు. ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలతో ఎన్నికల ముందు బిహార్‌లో రాజకీయ ఉష్ణోగ్రతలు పెంచారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీయే సంకల్పాన్ని ప్రజల ముందుంచారు. బిహార్‌లో రాబోయే ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయన్న ఆసక్తికర దశలో, ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
Read Also: Congress : కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ