PM Modi: ఎన్నికల వేళ మోడీ ఎత్తుగడలు, అయోమయంలో కాంగ్రెస్

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 02:38 PM IST

PM Modi: తాజాగా భారత మాజీ ప్రధాని.. దివంగత పీవీ నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యం లో ముంచేశాడు ప్రధాని మోడీ. ఈ ఏడాది ఇప్పటికే లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. తాజాగా శుక్రవారం చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పీవీ నరసింహారావు కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. స్వామినాథన్, చరణ్ సింగ్ విషయాలను కాస్త పక్కన పెడితే.. నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని అందించడం పట్ల తెలుగు రాష్ట్రాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు ఎటువంటి ప్రకటనలు రాలేదు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎటువంటి స్పందనను వెలిబుచ్చలేదు.నాడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. సోనియా కోటరి అంతగా విలువనిచ్చేది కాదని సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో అలవాటైన గ్రూపు రాజకీయాలను పెంచి మరింత పోషించడంతో పీవీ నరసింహారావు ఒకింత మనోవేదనకు గురయ్యారు. చివరికి ఆయన పరమపదించిన తర్వాత కూడా పార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పించలేదు. ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే కనీస సోయి కూడా ఆ పార్టీకి లేదు.పీవీ నరసింహారావుకు సంబంధించి జరిగిన అవమానంపై ఆయన కుటుంబ సభ్యులు ఎలుగెత్తినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి పివి నరసింహారావు ఘనతను భారతీయ జనతా పార్టీ గుర్తించింది.

బహుభాషా కోవిదుడికి.. ఆర్థిక రంగ పితామహుడికి భారతరత్న పురస్కారం అందించి ఆయన సేవలకు నిజమైన గౌరవం కల్పించింది. నాడు పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల వల్లే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం మొదలు పెట్టింది. నాడు ఆయన చేసిన ఘనతను గుర్తుంచుకొని బిజెపి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బిజెపి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పీవీ నరసింహారావు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం.. తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కొద్దో గొప్పో బలంగా ఉండటంతో.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం తమకు లాభిస్తుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు.