Gujarat: 43 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసిన కాంగ్రెస్..!!

  • Written By:
  • Updated On - November 5, 2022 / 12:25 PM IST

త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఈసారి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని హస్తం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే శుక్రవారం తన పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీఈసీ భేటీలో తొలి జాబితాలోని అభ్యర్ధులను ఖరారు చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ తొలి జాబితాలో అహ్మదాబాద్ నగరంలోని ఘట్లోడియా స్థానం నుంచి రాజ్యసభ సభ్యురాలు అమీ యాగ్నిక్‌ను బరిలోకి దింపారు. ఇక్కడ ఆమె ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను సవాలు చేస్తూ బరిలోకి దిగనున్నారు.

పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష మాజీ నాయకుడు అర్జున్ మోద్వాడియా పోర్ బందర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సయాజిగంజ్ నుండి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు అమీ రావత్, గాంధీనగర్ సౌత్ నుండి హిమాన్షు పటేల్, సూరత్ వెస్ట్ నుండి సంజయ్ పట్వా, ఓల్పాడ్ నియోజకవర్గం నుండి దర్శన్ నాయక్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. భావ్‌నగర్ జిల్లాలోని మహువ స్థానం నుంచి కోలీ సంఘం నాయకుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కనుభాయ్ కల్సారియా బరిలోకి దింపింది.

22ఏళ్లుగా గుజరాత్ ను పాలిస్తున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బీజేపీకి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి పోటినిచ్చేటట్టు కనిపిస్తోంది. ఇక బీజేపీ చేతిలో వరుసగా ఆరు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ ..ఇప్పటికైనా మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. మొత్తానికి గుజరాత్ లో త్రిముఖ పోటీ ఖచ్చితం.