Congress President: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఎవరెవరు ? కాబోయే చీఫ్ ఎవరు ?

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 07:40 AM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయి ? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ పడతారు? అనే అంశాన్ని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబరు 24న ప్రారంభమైంది. ఈనెల 30న తుది గడువు ముగిసేలోగా ఎవరెవరు నామినేషన్లు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇక అధ్యక్ష రేసులో నిలువకపోవచ్చని తెలుస్తోంది. ఇక పోటీలో నిలిచే కాంగ్రెస్ నాయకుల జాబితాలో మొదటి పేరు శశిథరూర్ దే ఉంది.
మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్, కే.సీ.వేణుగోపాల్, కుమారి సెల్జ, భూపేష్ భాగేల్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి దూకే ఛాన్స్ ఉంది. అక్టోబరు 1న ఈ నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబరు
8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ జరుగుతుంది. 19న ఫలితాలు వస్తాయి.

1998 తర్వాత ఇదే మొదటిసారి

1998 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగుతుండటం ఇదే మొదటిసారి. 1998లో జరిగిన ఎన్నికల్లో సీతారాం కేసరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2000 నుంచి సోనియా గాంధీ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. మధ్యలో రాహుల్ ఆ పదవిని చేపట్టినా.. 2019 ఎన్నికల తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.

ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో కేరళ ఎంపి అయిన శశిథరూర్​ బలమైన అభ్యర్థి. దేశంలో పాపులర్​వ్యక్తి, సోషల్​మీడియాలో ఫాలోయింగ్​బాగా ఉన్న నేత. దాదాపు 20 ఏండ్ల క్రితం ఆయన భారత ప్రభుత్వ మద్దతుతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఇంత బలమైన వ్యక్తి అయినప్పటికీ, గాంధీయేతర అభ్యర్థి కాబట్టి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించగలుగుతారా?
కాంగ్రెస్‌ నాయకత్వాన్ని కుదిపేసిన జీ-23లో ఒకరైన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కు గాంధీ ఫ్యామిలీ గెలవనిస్తుందా?అనేది చెప్పలేం.

గాంధీ కుటుంబేతరులు సక్సెస్ కాలేదు.

అయితే అధ్యక్ష ఎన్నికలతో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ కు తెరపడుతుందనుకుంటే.. కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో కొత్త గ్రూపులు పుట్టుకొస్తాయేమోననే అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. అయితే ఇదంతా డ్రామా మాత్రమేనని. లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి.. అంతిమంగా రాహుల్ కే కిరీటం పెడతారనే వాదన కూడా వినిపిస్తోంది.
కాంగ్రెస్ ను గాంధీ కుటుంబం తప్ప.. ఇతరులు నడపలేరనే వాదన చాలా కాలంగా ఉంది. గతంలో గాంధీ కుటుంబేతరులు అధ్యక్షులైనా.. పెద్దగా సక్సెస్ కాలేదు. గాంధీ కుటుంబం చేతిలో పగ్గాలుంటేనే.. పార్టీ ఒక్కతాటిపైకి వస్తుందని కార్యకర్తల నమ్మకం. అయితే కొంతకాలంగా ఈ నమ్మకానికి తూట్లు పడ్డా.. ఇతరుల కంటే రాహుల్ చాలా బెటర్ అనే అభిప్రాయం అయితే ఇంకా పోలేదు. ప్రస్తుతం అధ్యక్ష బరిలో దిగాలని ఉత్సాహంగా ఉన్న గెహ్లాట్.. థరూర్ ఎవరూ సమర్థులు కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. గెహ్లాట్ ఇప్పటికే వృద్దులైపోయారని, థరూర్ కు డ్రాఫ్టింగ్ స్కిల్సే తప్ప నాయకత్వ లక్షణాలు లేవనేది కాంగ్రెస్ వర్గాల టాక్.

చివరకు రాహుల్ గాంధీయే..

జరుగుతున్న తంతు చూస్తుంటే.. చివరకు రాహుల్ గాంధీయే అధ్యక్షుడౌతారనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేకపోతే.. రాహుల్ సడెన్ గా పాదయాత్ర మొదలుపెట్టరనే వాదన ఉంది. పార్టీలో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టేలా.. రాహుల్ తప్ప వేరే దిక్కు లేదని సీనియర్లతో స్టేట్ మెంట్లు ఇప్పించి.. అందర్నీ సైలంట్ చేయాలనేది హైకమాండ్ ఐడియాగా ఉంది. కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు ఇప్పటికే రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని మూడు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. దీంతో మళ్లీ గాంధీ కుటుంబసభ్యులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది.
కాంగ్రెస్ లాంటి పార్టీని నడపటం ఆషామాషీ వ్యవహారం కాదు. లోపాలు ఎవరైనా ఎత్తి చూపించొచ్చు. కానీ బాధ్యతలు తీసుకున్నప్పుడే అసలు విషయం అర్థమౌతుంది. సీనియర్ నేతలు కూడా సీఎంలుగా సహచరుల్ని తృప్తిపరచలేక.. ఢిల్లీ టూర్లు చేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పంచాయితీలు అధిష్ఠానం తీర్చాల్సిందే. ఇలాంటి కల్చర్ ఉన్న పార్టీలో గాంధీయేతరులు అధ్యక్షులుగా విజయవంతం కాలేరనే అభిప్రాయం కలిగించాడనికే ఎన్నికల పేరుతో హడావుడి చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.