Congress : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలపై పార్టీ స్పందిస్తూ, ఓటర్ల జాబితా డిజిటల్ కాపీతో పాటు పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది.
లేఖలో, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఓటర్ల జాబితాలను మెషిన్-రీడబుల్ ఫార్మాట్‌లో ఒక వారం లోపు అందుబాటులో ఉంచాలని స్పష్టంగా పేర్కొంది. అలాగే పోలింగ్ రోజు జరిగిన సంఘటనల వీడియో రికార్డింగ్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరింది. ఈ డిమాండ్ కొత్తదేం కాదని, గతంలోనూ పార్టీ తరపున అనేకమార్లు ఇదే విజ్ఞప్తి చేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తుచేసింది. ప్రజలు, రాజకీయ పార్టీల్లో ఎన్నికల ప్రక్రియపై నమ్మకం పెరిగేందుకు ఇవన్నీ అవసరమని పేర్కొంది.
పార్టీ అగ్రనాయకత్వ బృందం అవసరమైతే ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. తమ వద్ద ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, విశ్లేషణలు ఉన్నాయని, వీటిని కమిషన్‌కు సమర్పిస్తామని స్పష్టం చేసింది. ఇటీవల మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో ఓటర్ల జాబితాల్లో తారుమారులు, పారదర్శకతపై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.