INDIA : నో చెప్పిన ‘ఆ నలుగురు’.. ‘ఇండియా’ మీటింగ్ వాయిదా

INDIA : హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో డిసెంబర్‌ 6న తలపెట్టిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశం వాయిదా పడింది.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 03:25 PM IST

INDIA : హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో డిసెంబర్‌ 6న తలపెట్టిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశం వాయిదా పడింది. కూటమిలోని ప్రధాన పార్టీల నాయకులు హాజరుకావడం లేదనే కారణంగా మీటింగ్‌ను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే  వాయిదా వేశారని తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్(జేడీయూ చీఫ్), సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(టీఎంసీ చీఫ్), తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే చీఫ్) నలుగురూ ఈ  సమావేశానికి రాలేమని చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతం మిచౌంగ్ తుఫాను ఎఫెక్ట్ ఉంది. అక్కడి పరిస్థితులను సమీక్షించడంలో, ముందుజాగ్రత్త చర్యలను చేపట్టడంలో సీఎం స్టాలిన్ బిజీగా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఏ మాత్రం బిజీ షెడ్యూల్ లేని  మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్‌లు ఇండియా కూటమి భేటీకి దూరం కావడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై ఈ ముగ్గురు నేతలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రత్యేకించి మధ్యప్రదేశ్‌లో పొత్తులకు సిద్ధమైన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌ను కాంగ్రెస్ దూరంగా పెట్టింది. ఆయనతో సీట్ల సర్దుబాటుకు అంగీకరించలేదు. ఇక ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విడిగా పోటీ చేసింది. కూటమిలోని పార్టీలను పక్కన పెట్టి ఒంటరిగా ఎన్నికలకు పోయినందు వల్లే, ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ ఓడిపోయిందనే అభిప్రాయాన్ని ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. బహుశా ఈ అభిప్రాయంతోనే మీటింగ్‌కు డుమ్మా కొట్టి.. ఈ ముగ్గురు అగ్రనేతలు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారని పరిశీలకులు అంటున్నారు.

Also Read: 23 Deaths : ఎగిసిపడిన అగ్నిపర్వత లావా.. మరో 12 మంది సజీవ దహనం

రాష్ట్రాల అసెంబ్లీల్లో సాధ్యం కాని పొత్తులు.. లోక్‌సభ సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం ఏ విధంగా సాధ్యమవుతాయనే అభిప్రాయంతో అఖిలేష్ ఉన్నట్లు చెబుతున్నారు.  ప్రాంతీయ పార్టీలకు ఇండియా కూటమిలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకోగలిగితే ప్రాంతీయ పార్టీలు ‘ఇండియా’ కూటమిలో కొనసాగే అవకాశాలు ఉంటాయి.