Congress Bank Accounts : ఎలక్టోరల్ బాండ్ల విక్రయాల ద్వాారా రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించే పద్ధతిని సుప్రీంకోర్టు గురువారం రద్దు చేయడంతో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ హయాంలోనే 2018 సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల జారీ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చారు. ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఆ స్కీం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసినంత పనైంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ముడిపడిన ఒక ఆసక్తికర పరిణామం వివరాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ సహా ఇతర విభాగాలకు చెందిన మొత్తం నాలుగు బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఫ్రీజ్ చేసింది. ఈవిషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకొన్ని వారాలే ఉన్న టైంలో ఐటీ శాఖ దురుద్దేశంతోనే ఇలా చేసిందని ఆయన ఆరోపించారు. దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థ ఉనికిని ప్రశ్నార్ధకంగా మార్చేలా కేంద్ర సర్కారు ప్రవర్తిస్తోందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ట్యాక్స్ డిమాండ్స్‌తో లింక్ పెడుతూ కాంగ్రెస్‌కు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లోని దాదాపు రూ.210 కోట్లను ఆదాయపు పన్ను శాఖ ఫ్రీజ్ చేసిందని మాకెన్ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందన్నారు. ట్రిబ్యునల్ వద్ద విచారణ పెండింగ్‌లో ఉన్నందున తాము ఇన్నాళ్లూ ఈవిషయంపై ఎక్కడా మాట్లాడలేదని ఆయన చెప్పారు.ఐటీ శాఖ నిర్ణయం వెనుక రాజకీయ హస్తం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాలకు అంతరాయం కలిగించడానికి వ్యూహాత్మకంగా ఇలా చేస్తున్నారని మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Credit Card : ‘క్రెడిట్ కార్డు’ పోయిందా ఇలా చేయండి
‘‘ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉనికిలో లేదు. ఇది ఒక అరాచక పాలన. ప్రధాన ప్రతిపక్ష పార్టీని బలహీనం చేసే కుట్ర ఇది. మేం న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజల నుంచి న్యాయం కోరుతున్నాం’’ అని అజయ్ మాకెన్ (Congress Bank Accounts) పేర్కొన్నారు. 2018-19 ఎన్నికల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలను 45 రోజులు ఆలస్యంగా సమర్పించిందని, అంతమాత్రాన ఖాతాలను ఫ్రీజ్ చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది వివేక్ తంఖా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చెక్కులను స్వీకరించవద్దని పేర్కొంటూ బ్యాంకులకు ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు.