Site icon HashtagU Telugu

INDIA Chairperson : ‘ఇండియా’ కూటమి ఛైర్ పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే.. వివరాలివీ..

Kharge

Kharge

INDIA Chairperson : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మరో కీలక బాధ్యత దక్కింది.  విపక్షాల కూటమి ‘ఇండియా’కు ఛైర్ పర్సన్‌గా ఆయన నియమితులయ్యారు. ఇవాళ జరిగిన కూటమి నేతల వర్చువల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా ఎన్నుకుంటారని గత కొన్నిరోజులుగా ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పోటీ నుంచి నితీశ్ తప్పుకున్నారని తెలుస్తోంది. కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులతో ఈరోజు జరిగిన వర్చువల్ మీటింగ్‌లో సీట్ల పంపకాలపై చర్చలేం జరగలేదని సమాచారం. ఈ భేటీలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాలేదు. జూమ్ మీటింగ్‌పై సమాచారం ఉన్నప్పటికీ ఇతరత్రా కార్యక్రమాల మమతా బెనర్జీ హాజరు కాలేదని తెలిసింది. కాగా, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును ఇటీవల జరిగిన సమావేశంలో దీదీ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తమ పార్టీ నేతలు హాజరుకావడం లేదని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. జనవరి 22వ తేదీన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సోనియాగాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే(INDIA Chairperson), అధిర్‌ రంజన్‌ చౌదరికి ఆహ్వానాలు అందాయి. అయితే అయోధ్య పేరుతో బీజేపీ -ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయాలు చేశాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని లేఖలో హస్తం పార్టీ స్పష్టం చేసింది. అయోధ్య రామాలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకున్నా.. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కాంగ్రెస్‌ విమర్శించింది. మతం అనేది వ్యక్తిగత అంశమని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే,  లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌రంజన్‌ హాజరు కావడం లేదని వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read: Sankranti Festival : సంక్రాంతికి ఊరెళ్తున్నారా ? తెలంగాణ పోలీసుల సూచనలివీ

జనవరి 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ , యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 6 వేల మందికి పైగా ప్రముఖులకు ఆలయ ట్రస్ట్‌ నిర్వహకులు ఆహ్వానాలను పంపారు. మొత్తం మీద అయోధ్య రామమందిర అంశమే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.